పర్యాటకుల ఆదరణ పొందాలి
● గిరిజన మ్యూజియాన్ని పరిశుభ్రంగా ఉంచాలి ● ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం : ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మించిన గిరిజన మ్యూజియం పర్యాటకుల ఆదరణ పొందేలా ఉండాలని పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఆయన మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యాటకులు భారీగా తరలివస్తున్నందున మ్యూజియాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, కళాతృష్ణ ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవి, వర్షాకాలాల్లో కళాఖండాలు చెడిపోకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రద్దీ పెరుగుతున్నందున టికెట్ కౌంటర్లను విడివిడిగా ఏర్పాటు చేయాలని, సందర్శకులకు గిరిజన వంటకాలు తాజాగా అందించాలని ఇన్‌చార్జ్ వీరస్వామిని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేయొద్దని, పర్యాటకులకు మరిచిపోని అనుభూతి కల్పించాలని అన్నారు.
అంబేడ్కర్‌కు ఘన నివాళి..
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా పీఓ ఘనంగా నివాళులర్పించారు. ఐటీడీఏ యూనిట్ అధికారులతో కలిసి ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళితులు, మహిళలు, కార్మిక, కర్షకుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీఈ హరీష్, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, ఎస్‌డీసీ రవీంద్రనాథ్, ఏసీఎంఓ రమణయ్య, జీసీడిఓ అలివేలు మంగతాయారు, మేనేజర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


