వ్యయప్రయాసలు | - | Sakshi
Sakshi News home page

వ్యయప్రయాసలు

Apr 14 2025 12:55 AM | Updated on Apr 14 2025 12:55 AM

వ్యయప్రయాసలు

వ్యయప్రయాసలు

స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రంలేక..

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి దశాబ్దం కావొస్తున్నా జిల్లా కేంద్రంలో పదో తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకన (స్పాట్‌ వాల్యూయేషన్‌)కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో మారుమూల ఏజెన్సీ దూర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు ఎగ్జామినర్లుగా ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే స్పాట్‌కు వెళ్లి విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలు విన్నవించినా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వీడటంలేదు.

ఏజెన్సీ ఉపాధ్యాయుల తిప్పలు

ఖమ్మంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో స్పాట్‌ వాల్యూయేషన్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి సుమారు 150 ఉపాధ్యాయులు వెళ్లి అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మణగూరు, చర్ల వంటి మారుమూల ప్రాంత ఉపాధ్యాయులు ఖమ్మం వెళ్లి, అక్కడ వారు ఇచ్చే అలవెన్సులతో విధులను నిర్వర్తించడం భారంగా మారుతోంది. వసతి, భోజనం తదితర ఖర్చులకు ప్రభుత్వం అందచేసే రోజువారీ వేతనం సరిపోవటం లేదని ఎగ్జామినర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో స్పాట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే లాడ్జి, ఆహార ఖర్చుల ఆదాతో పాటు ఇంటి నుంచి వచ్చి వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూల్యాంకన కేంద్రానికి ప్రత్యేకంగా సెంటర్‌ కోడ్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, డెవలప్‌మెంట్‌ అధికారులు, కావాల్సిన ఇతర వసతులు ఉన్నాయి. అయినా మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన యాద్రాద్రి, సూర్యాపేట, సిరిసిల్ల వంటి జిల్లాల్లో స్పాట్‌ వాల్యూయేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారని, కానీ భద్రాద్రి జిల్లాలో ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌, డీఈఓ స్పందించి జిల్లాలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఖమ్మంలోనే పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం

దశాబ్దం కావొస్తున్నా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయని అధికారులు

అలవెన్సులు సరిపోక

ఏజెన్సీ ఉపాధ్యాయుల ఇక్కట్లు

పదేళ్లు కావొస్తున్నా..

2014లో జిల్లాల పునర్విభజనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. దీంతో ఐటీడీఏలో ఉన్న డీఈఓ పోస్టును జిల్లాకు కేటాయించి జిల్లా విద్యాశాఖ అధికారిని నియమించారు. పదో తరగతి, ఇంటర్‌ మీడియట్‌ వార్షిక పరీక్ష పేపర్లను నిబంధనల ప్రకారం ఇక్కడే మూల్యాంకనం చేయాలి. జిల్లా ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా జిల్లా కేంద్రంలో స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలతోపాటు సప్లిమెంటరీ పరీక్షల పేపర్లు.. రెండింటిని ఇక్కడే మూల్యాంకనం చేయాలి. ఇందులో కేవలం సప్లిమెంటరీ పరీక్షలకు స్పాట్‌ సెంటర్‌ను 2017లో నిర్వహించినా అనంతరం మళ్లీ ఖమ్మం మార్చారు. గతంలో ఇంటర్‌ మీడియట్‌ పేపర్ల మూల్యాంకనం ఖమ్మం జిల్లాలోనే ఉండగా గతేడాది నుంచి భద్రాద్రి జిల్లా కేంద్రంలోనే నిర్వహిస్తున్నారు.

ఎన్నిమార్లు విన్నవించినా...

జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో మార్లు విన్నవించాం. అయినా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని వల్ల దూర ప్రాంతాల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

– ఎస్‌.విజయ్‌కుమార్‌, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

కొత్త జిల్లా కావడంతో..

మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు అన్ని వసతులు కావాలి. నిపుణులైన సిబ్బంది ఉండాలి. వీటి వల్ల ఆలస్యమైంది. మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. వచ్చే ఏడాదికి అనుమతులు వస్తే జిల్లా కేంద్రంలోనే స్పాట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం.

–ఎం.వెంకటేశ్వరాచారి, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement