‘సీతారామ’పై వాస్తవాలు వెల్లడించాలి
ప్రాజెక్టు పూర్తికాకుండానే
జలాల తరలింపు
సింగరేణి(కొత్తగూడెం): సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణంపై మంత్రి తుమ్మల నాగేఽశ్వరరావు వాస్తవాలు వెల్లడించాలని, జిల్లా రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా తరలించే కుట్రలను సీపీఎం చూస్తూ ఊరుకోబోదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మంచికంటి భవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. మంత్రి తుమ్మల గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చినట్లు చెబుతుండడంతో భద్రాద్రి జిల్లా రైతాంగంలో ఆందోళన నెలకొందన్నారు. ఇటీవల తాము కుమ్మరిగూడెం నుంచి జూలూరుపాడు వరకు ప్రాజెక్ట్ పంప్ హౌజ్‌లు, కాల్వలను పరిశీలించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోగా, నదికి గండి కొట్టించి నీటిని సీతారామ కాల్వకు మళ్లించినట్లు గుర్తించామన్నారు. ఫలితంగా హెవీవాటర్ ప్లాంట్, మిషన్ భగీరథ, సింగరేణి అవసరాల కోసం నిల్వ చేసిన జలాలు అడుగంటాయని చెప్పారు. అంతేకాక గోదావరి జలాలు భద్రాద్రి జిల్లా రైతాంగానికి ఇవ్వడానికి ఎలాంటి పనులు చేపట్టకపోగా, భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాలకు నీరు అందకుండా డిజైన్ మార్చారని ఆరోపించారు. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కాకుండా గోదావరి జలాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించే కుట్ర దాగి ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఏ.జే.రమేష్, లిక్కి బాలరాజు, అన్నవరపు సత్యనారాయణ, రేపాకుల శ్రీనివాస్, భూక్యా రమేష్, తదితరులు పాల్గొన్నారు.


