మణుగూరుటౌన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్‌ను బదిలీ చేసినా వెళ్లకుండా ఇన్‌చార్జ్ వార్డెన్‌కు బాధ్యతలు అప్పగించకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో హాస్టల్‌లో పంచనామా నిర్వహించి ఇన్‌చార్జ్‌కి బాధ్యతలు అప్పగించిన ఘటన మణుగూరులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం, మెనూ పాటించకపోవడం, అందుబాటులో ఉండకపోవడం, అధికారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ను జిల్లా అధికారులు డిప్యూటేషన్‌పై గతేడాది డిసెంబర్‌లో భద్రాచలం బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌గా రాంబాబును నియమించగా ఆయనకు తాళాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో వార్డెన్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి మొదటి తప్పుగా క్షమించాలని కోరడంతో వార్డెన్‌ని అశ్వారావుపేట బదిలీ చేశారు. అయినా నాటి నుంచి నేటివరకు మణుగూరు ఎస్సీ బాలుర హాస్టల్ తాళాలు ఇన్‌చార్జ్ వార్డెన్‌కు అప్పగించకుండా తాత్సారం చేస్తుండటంతో ఫోన్ చేసినా అందుబాటులో లేనంటూ సమాధానం చెబుతూ పిల్లలకు వారానికి సరిపడా సరుకులు ఇస్తూ వస్తున్నాడు. దీంతో ఇన్‌చార్జ్‌గా నియమితులైన వార్డెన్ రాంబాబు తరచూ హాస్టల్‌కి రావడం తాళాలు వేసి ఉండటంతో వెనుదిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏఎస్‌డబ్ల్యూఓ హనుమంతరావు, ఆర్‌ఐ గోపి, సమితిసింగారం సెక్రటరీ శ్రీకాంత్ సమక్షంలో హాస్టల్ తాళాలు పగులగొట్టి సామగ్రిపై పంచనామా నిర్వహించి ఇన్‌చార్జ్ వార్డెన్ రాంబాబుకి బాధ్యతలు అప్పగించారు.