భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని చైన్నె హైకోర్టు జడ్జి శివగ్నానమ్ సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. శ్రీ అభయాంజనేయస్వామి ఉపాలయంలో పండితులు వేదాశీర్వచనం జరిపి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, కత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాల రామయ్యను..
దుమ్ముగూడెం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని చైన్నె హైకోర్టు జడ్జి శివగ్నానమ్ కుటుంబసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పంచవటీ కుటీరం, నారచీరల ప్రాంతాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గణేష్, ఆలయ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
సింగరేణి విద్యార్థినుల ప్రతిభ
సింగరేణి(కొత్తగూడెం): ఈ నెల 19న ఖమ్మంలోని కవితా మోమెరియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెిస్టివల్‌లో సింగరేణి మహిళా కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఫెస్టివల్‌కు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి 108 మంది హాజరుకాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందికి ఎంపిక చేసి బహుమతులు అందించారు. సింగరేణి కళాశాల విద్యార్థినులు కె.వెన్నెల, ఎండీ ఆయేషా మూడో, నాలుగో స్థానాల్లో నిలవగా సోమవారం ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్, కరస్పాండెంట్ కే.సునీల్‌కుమార్, ప్రిన్సిపాల్ చింతల శారద తదితరులు అభినందించారు.
నేత్రదానం
టేకులపల్లి: మండలంలోని బోడు గ్రామానికి చెందిన పంజాల సముద్ర(60) కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందతూ సోమవారం మృతి చెందింది. ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. కాగా మృతురాలికి భర్త రాములు, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
మున్నేటిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి
ఖమ్మంరూరల్: ఖమ్మం బాలాజీనగర్‌కు చెందిన సయ్యద్ మౌలానా అలియాస్ అఫ్రోజ్(21) రాజీవ్ గృహకల్ప వద్ద మున్నేటికి వెళ్లగా ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. పలువురు స్నేహితులతో కలిసి ఆయన సోమవారం సరదాగా వెళ్లాడు. అయితే, మౌలానాకు ఈత రాకపోవడంతో నీటిలోకి దిగగానే మునిగిపోసాగాడు. ఆయన వెంట ఉన్న వారికి కూడా ఈత రాక రక్షించే అవకాశం లేకపోవడంతో మృతి చెందాడు. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న మౌలానా కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. ఈమేరకు సమాచారం అందుకున్న సీఐ ముష్క రాజు, పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని బయటకు తీయించి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఐదుగురిపై పోక్సో కేసు
ఎర్రుపాలెం: మండలంలోని భీమవరం హరిజనవాడ పంచాయతీకి చెందిన బాలికను(17)ను ప్రేమ పేరిట మాయమాటలతో నమ్మించి గర్భవతిని చేసి వ్యక్తితో పాటు పలువురిపై పోక్సో కేసు నమోదైంది. ప్రధాన నిందితుడైన ముల్లంగి జమలయ్యతో పాటు ఆయన తల్లిదండ్రులు ముసలయ్య – మరియమ్మ, బాలికను అబార్షన్‌ను ప్రేరేపించిన ఆర్‌ఎంపీ నరేందర్, గర్భ విచ్ఛిత్తికి ప్రయత్నించిన నర్సు భవానీపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్సై పి.వెంకటేశ్ తెలిపారు.
కోడి పందేల స్థావరాలపై దాడి
ములకలపల్లి: గుట్టుచప్పుడు కాకుండా కోడిపందేలు ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజుపేట శివారులో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, రూ 1,500 నగదు, మూడు కోడిపుంజులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిన్నెర రాజశేఖర్ తెలిపారు.
రామయ్య సన్నిధిలో జడ్జి