● రోయింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచన ● పగిడేరులో జియోథర్మల్, తుమ్మలచెరువు సందర్శన
మణుగూరు టౌన్/అశ్వాపురం : మణుగూరు మండలంలోని కొండాయిగూడెం వద్ద గోదావరి, రథంగుట్ట, సింగరేణి, అంబేద్కర్ పార్క్, పగిడేరు జియోథర్మల్‌ను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం మణుగూరులో పర్యటించిన ఆయన జియోథర్మల్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం సాంబాయిగూడెం ఇసుక క్వారీ వద్ద లారీ యజమానులతో మాట్లాడారు. పరిమితికి మించి ఇసుక లోడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లోడింగ్ వద్ద డబ్బులు వసూలు చేస్తే చర్య తప్పదని హెచ్చరించారు. అంతకుముందు అశ్వాపురం మండలం మల్లెలమడుగు ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలను పరిశీలించారు. పరీక్షలు బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత నెల్లిపాకలో మండ్రు నాగసుధీర్ అనే రైతు సాగు చేస్తున్న మునగ పంటను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. మునగకాయలతో పాటు ఆకు కూడా అమ్మి ఆర్థికాభివృద్ధి సాధించాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం తుమ్మలచెరువు వద్ద రోయింగ్ వాటర్ స్పోర్ట్స్ శిక్షణ ఇస్తున్న అంతర్జాతీయ రోయింగ్ క్రీడాకారుడు యలమంచిలి కిరణ్‌తో మాట్లాడారు. శిక్షణకు ఎంత మంది వస్తున్నారు.. యువకులు ఆసక్తి చూపుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భారజల కర్మాగారంలో..
మణుగూరు భారజల కర్మాగారాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. జీఎం హెచ్‌కే.శర్మ, అధికారులతో సమావేశమై పలు అంశాలపై కలెక్టర్ చర్చించారు. గోదావరి నుంచి నీరు సేకరించి భారజలం ఉత్పత్తి అయ్యాక మిగిలే నీటిలో మినరల్స్ కలిపి వాటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తే స్థానికులకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మణుగూరు, అశ్వాపురం తహసీల్దార్లు రాఘవరెడ్డి, స్వర్ణలత, ఎంపీడీఓలు శ్రీనివాస్, వరప్రసాద్, ఏపీఎం సత్యనారాయణ, ఎంపీఓ ముత్యాలరావు, ఆర్‌ఐ లావణ్య, ఈఓఆర్డీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.