వచ్చే నెల 1 నుంచి సన్నబియ్యం పంపిణీ
● జిల్లాలో 2,93,263 మంది రేషన్ కార్డుదారులకు లబ్ధి ● పంపిణీ ప్రక్రియపై కొనసాగుతున్న సమావేశాలు ● కొత్త రేషన్‌కార్డుల మంజూరుపైనా కసరత్తు
కొత్తగూడెంఅర్బన్: పేద ప్రజలకు వచ్చే నెల నుంచి ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం అందించనుంది. ఉగాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని గతంలోనే ప్రకటించగా, దీనిపై పౌరసరఫరా శాఖ ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు దొడ్డు బియ్యం అందిస్తుండగా కొందరు లబ్ధిదారులు తినలేక దళారులకు విక్రయిస్తున్నారు. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం రానుండటంతో కార్డుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పెరగనున్న రేషన్‌కార్డులు
జిల్లాలో గత జనవరిలో 1,203 కార్డులు కొత్తగా మంజూరు చేశారు. నూతన కార్డుల లబ్ధిదారులకు ఫిబ్రవరి నుంచి బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం గతం కంటే 7,152 కిలోల బియ్యాన్ని అదనంగా రేషన్‌షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇక ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, గతంలో పెండింగ్‌లో ఉన్నవి మొత్తం కలిసి మరో 34 వేల మందికి కొత్తగా కార్డులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో 2,93,263 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో కార్డులేని కుటుంబాలు దశాబ్దకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. స్కాలర్‌షిప్, ఆరోగ్యశ్రీ,సేవలు, ఆదాయ సర్టిఫికెట్, రుణాలు పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో కొత్త కార్డుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు.
ఏప్రిల్ నుంచే అందించే అవకాశం
జిల్లాలో ఏప్రిల్ నెల నుంచి రేషన్‌కార్డుల లబ్ధిదారులకు సన్నబియ్యం అందించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియపై రాష్ట్ర అధికారులు వీడియో, టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. కొత రేషన్ కార్డుల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం.
–రుక్మిణి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి
మార్కెట్‌లో అధిక ధరలతో..
మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. క్వింటా సన్న బియ్యం రూ.6 వేల నుంచి మొదలుకుని రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్నబియ్యం అందిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరట లభించనుంది. కాగా ప్రజాపాలన గ్రామసభల్లో రేషన్‌కార్డుల కోసం 34 వేల దరఖాస్తులు, మార్పులు, చేర్పుల కోసం మరో 20 వేల దరఖాస్తులు రాగా, ఆ ప్రక్రియ పూర్తి చేసే పనిలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
జిల్లాలోని రేషన్‌కార్డుల వివరాలు
రేషన్‌షాపులు 443
ఆహారభద్రత కార్డులు 2,72,112
అంత్యోదయ 21,148
అన్నపూర్ణ కార్డులు 3
మొత్తం కార్డులు 2,93,263
ప్రతీనెల అందించే బియ్యం 5,384.762
మెట్రిక్ టన్నులు
ఇటీవల మంజూరైన కార్డులు 1203
కొత్తగా వచ్చిన దరఖాస్తులు 34,083
మార్పులు చేర్పుల దరఖాస్తులు 20,000
సమయం ఆసన్నం
సమయం ఆసన్నం