● ఐదెకరాల భూమి ఉన్న రైతులకు రాయితీ ● అదనపు కలెక్టర్ విద్యాచందన
దమ్మపేట: మునగ పంట సాగు చిన్న, సన్నకారు రైతులకు లాభదాయకమని జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మల్లారం రైతు వేదికలో మునగ సాగుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. మునగ సాగు ప్రారంభ దశ నుంచి తొమ్మిది నెలల లోపు ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.10 లక్షలను ప్రోత్సాహకం, రాయితీల రూపంలో ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రాయితీకి ఐదు ఎకరాల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులతో పాటు పదెకరాలు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులు కూడా అర్హులేనని అన్నారు. మునగ పంట ద్వారా ఏటా ఎకరాకు రూ.లక్ష ఆదాయంపాటు మునగ ఆకుల ద్వారా మరికొంత ఆదాయం పొందవచ్చని వివరించారు. వ్యవసాయ క్షేత్రాల్లో చిన్న చెరువులను నిర్మించుకుని చేపల పెంపకం, గెదేలు, కోళ్ల ఫారం షెడ్డులు, ఇంకుడు గుంతలు నిర్మించుకుని ఉపాధి హామీ పథకం ద్వారా రాయితీలు పొందాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి బాబూరావు మాట్లాడుతూ పామాయిల్ సాగు తొలిదశలో అంతర పంటగా మునగ సాగు చేపట్టవచ్చని అన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటల నిర్మాణం వలన భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు రవికుమార్, దమ్మపేట ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి, అశ్వారావుపేట ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ రామారావు, ఏపీఓ సుధాకర్‌రావు, పంచాయతీ కార్యదర్శి సంజీవ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.