టేకులపల్లి: మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని గాయత్రిని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం అభినందించారు. కలెక్టర్ ప్రయోగాత్మకంగా చేసిన బాలమేళా కార్యక్రమంలో భాగంగా ఎఫ్‌ఎల్‌ఎన్ ద్వారా అమలు చేసిన రాయటం, చదవడం అనే విధానం ద్వారా రెండో తరగతి విద్యార్థి గాయత్రి వేదికపై కథను చదివి వినిపించింది. దీంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పాత కొత్తగూడెంలో ఉన్న జిల్లా విద్యా వనరుల కేంద్రంలో జరిగిన బాలమేళా ముగింపు ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ బొమ్మనపల్లి విద్యార్థులు ప్రదర్శించిన నాటిక, పద్యం, కథలతో ప్రతిభ చాటారని ప్రశంసించారు. బొమ్మనపల్లి పాఠశాల బాలమేళాలో బెస్ట్ స్కూల్‌గా ఎంపిక కాగా, హెచ్‌ఎం ఎం.జ్యోతిరాణిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరచారి, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజ శేఖర్, టేకులపల్లి ఎంఈఓ జగన్, జర్పల పద్మ పాల్గొన్నారు.