భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
డిగ్రీ కళాశాల
అధ్యాపకుడికి డాక్టరేట్
ఇల్లెందురూరల్: ఇల్లెందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు రావులపాటి వెంకటేశ్వర్లుకు కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. కేయూ సీనియర్ ప్రొఫెసర్ పంతంగి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ‘డాక్టర్ సీతారాం సాహిత్యం – అధ్యయనం’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంధానికి డాక్టరేట్ ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లును మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య ఆధ్వర్యాన సన్మానించారు. వైస్ ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రావు, అధ్యాపకులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ నాగేశ్వరరావు, కృష్ణవేణి, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాకేష్ శ్రీరాం, డాక్టర్ రాజు, ఈశ్వర్, సురేందర్, సరిత, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, లక్ష్మణ్‌రావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కొత్తగూడెంఅర్బన్: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడుతామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భాస్కర్‌నాయక్ తెలిపారు. మంగళవారం కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టికను ప్రదర్శించాలని, పనిచేసే వైద్యుల సర్టిఫికెట్లను ఫైల్ చేయాలని తెలిపారు. ఆయుష్ ఆస్పత్రులు, ఫిజియోథెరిపీ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓతో పాటు డిప్యూటీ డెమో ఫయాజ్ మొహినుద్దీన్, పాయం శ్రీను, డిప్యూటీ పీఎంఓ తదితరులు పాల్గొన్నారు.
కవితా పోటీల
కరపత్రాలు ఆవిష్కరణ
పాల్వంచ: పాల్వంచ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి కవితా పోటీలు నిర్వహించనున్నట్లు కళాపరిషత్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ బిక్కసాని సుధాకర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పోటీల కరపత్రాలను ఆవిష్కరించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, జాతీయ వాదం పరిణామాలు అనే అంశాలపై 30 లైన్లకు మించకుండా కవితలు రాసి ఈనెల 26వ తేదీ నాటికి 93993 24497, 98498 90322 నంబర్లకు పంపించాలని కోరారు. విజేతలకు నగదు బహుమతులు, సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్, కొండల్ రావు, నర్సింహాకుమార్ పాల్గొన్నారు.
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం