బూర్గంపాడు: గోదావరి తీరంలో కొలువైన ఇరవెండి సంతాన వేణుగోపాలస్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీన రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాల స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. చోళుల కాలంనాటి పురాతన సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో కల్యాణం రోజున గరుడ ముద్దలు పంపిణీ చేస్తారు. సంతానం లేనివారు ఈ గరుడ ముద్దలు స్వీకరిస్తే సంతానం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు విశ్వాసం. పూర్వం ఈ ఆలయంలో స్వామివారిని వెండిపూలతో పూజించేవారని చెబుతుంటారు. అందుకే ఈ గ్రామానికి విరివెండిగా పేరువచ్చిందని, కాలక్రమంలో ఇరవెండిగా మారిందని, ఈ ఆలయం ఎదుట అష్టభుజ సత్తెమ్మ తల్లి విగ్రహం ఉండగా.. ఆలయానికి ఆమె రక్షణగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. హోలీ పండుగ రోజున జరిగే స్వామివారి కల్యాణానికి ఆలయ కమిటీ బాధ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం స్వామివారి మేలుకొలుపు, అభిషే కాలు, ఆర్జిత సేవలు.. కల్యాణం అనంతరం అన్న సమారాధన, సాయంత్రం తిరువీధిసేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కల్యాణాన్ని వీక్షించేందుకు జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య వెల్లడించారు.
నేడు వేణుగోపాలస్వామి కల్యాణం