సూపర్‌బజార్(కొత్తగూడెం): మార్చి 19 లోపు ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ దారాప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణాలు తనిఖీ
అశ్వాపురం: మండలంలోని మల్లెలమడుగు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలను గురువారం క్వాలిటీ కంట్రోల్ డీఈ శశికళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీ రోడ్లను నిర్దేశిత సమయానికికల్లా పూర్తి చేయాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
సుజాతనగర్: 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలల గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో (ఇంగ్గిష్ మీడియం) మిగిలిపోయిన ఖాళీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వి.బ్యూలారాణి గురువారం ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈబీసీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ నెల 31 వరకు తుది గడువు అని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు.
‘దుమ్ము, ధూళితో
ఇబ్బంది పడుతున్నాం..’
టేకులపల్లి: సింగరేణి నిధులతో రేగులతండా నుంచి దాసుతండా వరకు ఏడాది కిందట చేపట్టిన రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో దుమ్ము, ధూళితో ఆస్పత్రి పాలవుతున్నామని, ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొందని రేగులతండాలో సంత్ శ్రీ సేవాలాల్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఇస్లావత్ నామానాయక్ ఆధ్వర్యంలో సింగరేణి వాహనాలను నిలిపి నిరసన తెలిపారు. దీంతో కార్మికులను విధులకు తరలించే బస్సు, బొగ్గు లారీలు, టిప్పర్లు నిలిచిపోయాయి. కనీసం నీటి పిచికారీ కూడా సరిగ్గా చేయడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, టేకులపల్లి సీఐ సురేశ్.. నామానాయక్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 25 లోపు రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
దీక్షలు విరమించండి.. సీఎండీకి నివేదిస్తా
సత్తుపల్లి: సైలో బంకర్‌తో స్థానికులకు ఎదురవుతున్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నందున దీక్షలు విరమిస్తే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని కిష్టారం అంబేద్కర్‌నగర్‌లో సైలో బంకర్‌కు వ్యతిరేకంగా 30రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. స్థానికులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సింగరేణి సీఎండీ బలరాంనాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం లభించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ సైలోబంకర్ సమస్యను ఎమ్మెల్యే రాగమయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించారరని తెలిపారు. ప్రజల ఆవేదనపై ప్రభుత్వంతోనైనా గట్టిగా చర్చించనున్నందున తమపై నమ్మకంతో దీక్షలు విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం షాలేం రాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సైతం సైలో బంకర్ బాధితులు కలిశారు. సమస్యపై సింగరేణి సీఎండీతో కలిసి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులం మాట్లాడతామని, అయినా ఫలితం లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ఈమేరకు దీక్షలను విరమించాలని ఆయన సూచించగా, చర్చించుకుని శనివారం చెబుతామని అటు సింగరేణి డైరెక్టర్, ఇటు మంత్రికి అంబేద్కర్‌నగర్ కాలనీవాసులు బదులిచ్చారు.
ఓటరు జాబితా సవరణ పూర్తిచేయాలి
ఓటరు జాబితా సవరణ పూర్తిచేయాలి