● సుందరీకరణ పనులు సాగుతున్నాయి.. ● పెయింటింగ్‌లు చివరి దశకు చేరాయి ● ఐటీడీఏ పీఓ రాహుల్ వెల్లడి
భద్రాచలంటౌన్ : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మిస్తున్న ట్రైబల్ మ్యూజియం పనులు చివరి దశకు చేరాయని, ఈనెల 22 వరకు పూర్తి చేస్తామని, శ్రీరామనవమి నాటికి మ్యూజియాన్ని ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని పీఓ బి.రాహుల్ తెలిపారు. మ్యూజియం పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యాటకులకు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుండి పోయేలా రూపొందిస్తున్నామని, మ్యూజియాన్ని చూడగానే కొత్త అనుభూతి వచ్చేలా సుందరీకరణ పనులు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పాతకాలపు ఇల్లు నిర్మాణంతో పాటు కోయ సంస్కృతికి సంబంధించిన పెయింటింగ్‌లు పూర్తి కావొస్తున్నాయని అన్నారు. పండుగలకు సంబంధించిన బొమ్మల చిత్రీకరణ కొనసాగుతోందని, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, బోటింగ్ చెరువుతో పాటు ఆర్చరీ గ్రౌండ్ పనులు పూర్తి కావచ్చాయని వెల్లడించారు. మ్యూజియం సందర్శనకు వచ్చే వారికి గిరిజన వంటకాలతో పాటు చైనీస్ ఫుడ్ అందుబాటులో ఉంచుతున్నామని, ఈ మేరకు స్టాళ్లు సిద్ధం చేశామని చెప్పారు. సందర్శకులు కొనుగోలు చేసేందుకు కోయ కల్చర్ బొమ్మలు అందుబాటులో ఉంచుతామని, పాత తరానికి చెందిన కళాఖండాలు సిద్ధం చేశామని వివరించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ ఆయా శాఖల అధికారులు చంద్రశేఖర్, ఉదయ్‌కుమార్, హరీష్, గోపాలరావు, నర్సింగరావు, వేణు, ప్రభాకర్ రావు, శ్రీనివాసరావు, చిట్టిబాబు, మ్యూజియం ఇన్‌చార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.