● ఈ నెలాఖరుకల్లా రైతులందరికీ భరోసా జమ ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సత్తుపల్లిటౌన్: రానున్న నాలుగేళ్లలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని, తద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏడు నుంచి ఎనిమిది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టులో భాగమైన సత్తుపల్లి మండలం యాతాలకుంటలోని ట్రంక్ టన్నెల్ పనులను గురువారం ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్ వి.పాటిల్‌తో కలిసి పరిశీలించారు. ఈక్రమంలో టన్నెల్‌లోకి మంత్రి తుమ్మల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి పనులను పరిశీలించాక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే ఉగాదికల్లా బేతుపల్లి చెరువు, లంకాసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరతాయని, తద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. జిల్లా యంత్రాంగానికి ప్రజల సహకారం.. ఆపై శ్రీరామచంద్రుడి దయతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు టన్నెల్ భూసేకరణ, అటవీ అనుమతుల కోసం కలెక్టర్ చొరవ చూపితే పాలేరుకు సైతం గోదావరి జలాలు చేరతాయన్నారు. ఇద్దరు కలెక్టర్లు కష్టపడుతూనే మనస్సు పెట్టి పనిచేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు.
త్వరలోనే భరోసా, బోనస్
రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.10వేల కోట్లు ఈనెలాఖరు నాటికి జమ చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఖజానాలో నిల్వలు లేనప్పటికీ అప్పోసప్పో చేసైనా నిధులు విడుదల చేస్తామన్నారు. అలాగే, సన్నధాన్యం అమ్మిన రైతులకు రూ.1,100 కోట్ల బోనస్‌కు గాను ఇప్పటి వరకు రూ.900 కోట్లు చెల్లించామని, మిగతావి సైతం త్వరలో అందిస్తామన్నారు. ఇక ఖమ్మం–రాజమండ్రి గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆగస్టు 15 కల్లా ఈ రహదారి అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. బుగ్గపాడు ఫుడ్‌పార్కులో మరో రెండు పరిశ్రమలు ఏర్పాటు కానుండగా, ఉగాది నాటికి కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు.
సంప్రదాయ పంటలు వద్దు..
నీళ్ల విలువ రైతులకే ఎక్కువగా తెలుస్తుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈమేరకు సంప్రదాయ పంటలు కాకుండా ఆయిల్‌పామ్ వంటివి సాగు చేస్తే రైతులు రాజుల్లా బతకవచ్చన్నారు. ఉపాధిహామీ పథకంతో ఉచితంగా నీటి గుంతలు తవ్విస్తున్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ రైతులు అవగాహనతో లాభదాయక వ్యవసాయం చేస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా బాగు పడతాయని తెలిపారు. ఖమ్మం జెడ్పీ సీఈఓ దీక్షారైనా, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎస్‌ఈలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసాచారి, మార్కెట్ చైర్మన్లు దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజాచౌదరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.రాజేశ్వరి, ఎఫ్‌డీఓ మంజులతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, డాక్టర్ మట్టా దయానంద్, సాధు రమేష్‌రెడ్డి, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, చల్లగుళ్ల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.