ఫోర్జరీ కేసులో ఒకరి అరెస్ట్‌

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ బస్వారెడ్డి - Sakshi

ఖమ్మంరూరల్‌: మండలంలోని ఏదులాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి అనుమతుల కోసం గ్రామకార్యదర్శి నాగరాజు సంతకాన్ని ఫోర్జరీ చేసిన నాయుడుపేటకు చెందిన వై.లక్ష్మారెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం రూరల్‌ ఏసీపీ బస్వారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కార్యదర్శి నాగరాజు సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా నకిలీ స్టాంప్‌లతో లక్ష్మారెడ్డి ఇంటి అనుమతి పత్రాలను ఇచ్చినట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఇదే కేసులో తనగంపాడుకు చెందిన నాగరాజు కూడా ఉండగా ఆయన గాలిస్తున్నట్లు తెలిపారు. కొద్దిరోజుల క్రితం తనంగంపాడులో బతికి ఉన్న భార్యాభర్తలు మృతి చెందినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కేసులో ఇంకా ముగ్గురిని అరెస్ట్‌ చేయాల్సి ఉందని వెల్లడించారు. భూముల ధర పెరగడంతో పలువురు అక్రమ మార్గంలో సొంతం చేసుకోవాలని యత్నిస్తున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి అవసరమైన పీడీ యాక్ట్‌ పెడతామని పేర్కొన్నారు. కాగా, కొందరు నకిలీ ధృవపత్రాలు, పహాణీలు, పాస్‌బుక్కులు సమర్పించి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారనే సమాచారంతో విచారణ చేపడుతున్నట్లు ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు.

వివరాలు వెల్లడించిన ఏసీపీ బస్వారెడ్డి

Read latest Bhadradri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top