బాపట్లటౌన్: ప్రజల వద్దకు పాలన తీసుకురావడంలో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఈటీసీ కార్యాలయంలో శనివారం ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. తొలుత జిల్లా ఆవిర్భావ దినోత్సవంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన 12 మంది విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్న మోదుకూరుకు చెందిన టి సీతారామిరెడ్డిని కలెక్టర్ సత్కరించారు. బాపట్ల సేవా సేతు కింద యాజలి గ్రామ అభివృద్ధికి కోటి రూపాయలు విరాళం అందజేసిన జి.సత్యనారాయణను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ పునర్విభజన తర్వాత 20 మండలాలతో ఏర్పడిన బాపట్ల జిల్లాకు తొలి కలెక్టర్‌గా పనిచేసే అవకాశం లభించడం సంతోషదాయకమన్నారు. జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తోందని, ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. బాపట్ల జిల్లాను టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయడానికి చర్యలు మొదలయ్యాయని ఏపీ మానవవనరుల అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి, సంచాలకులు విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి అన్నారు. గొప్ప చారిత్రాత్మక జిల్లాగా బాపట్ల జిల్లా చరిత్ర నిలిచిపోయిందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల జిల్లా కార్యదర్శి పి సి సాయిబాబు తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ ఎం శ్రీనివాసరెడ్డి, సంఘం నాయకులు గురజాల శ్రీనివాసరావు, జి వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు..
లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భ్రూణ హత్యలు బాపట్ల జిల్లాలో పూర్తిస్థాయిలో నిరోధించాలన్నారు. గర్భంలో ఉన్న బిడ్డను పుట్టకముందే నాశనం చేయడం చాలా బాధాకరం అన్నారు. ఇలాంటివి ప్రభుత్వం నిషేధించిందన్నారు. జిల్లాలో ఉన్న స్కానింగ్ సెంటర్ల తనిఖీలు పకడ్బందీగా కొనసాగించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని సీనియర్ సివిల్ జడ్జి జి.వాణి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, డీసీహెచ్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మావతి, కమిటీ సభ్యులు డాక్టర్ రామకృష్ణ హనుమాన్, మరియమ్మ, షాడో ప్రతినిధి రాజాసాల్మన్ పాల్గొన్నారు.
స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం..
స్వచ్ఛత అనేది ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. శనివారం, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన సామూహిక మరుగుదొడ్ల (పురుషులు) సముదాయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మరుగుదొడ్లను స్వచ్ఛ భారత్ మిషన్ పథకం నుంచి రూ.21 లక్షలు, జిల్లా పరిపాలన నిధుల నుంచి రూ. 9 లక్షలు మొత్తం రూ.30 లక్షలతో అధునాతన హంగులతో నిర్మించామన్నారు. మహిళల మరుగుదొడ్ల సముదాయాన్ని బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ అనంతరాజు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


