చేనేతపై చంద్రబాబు చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

చేనేతపై చంద్రబాబు చిన్నచూపు

Feb 17 2026 7:44 AM | Updated on Feb 17 2026 7:44 AM

చేనేతపై చంద్రబాబు చిన్నచూపు

చేనేతపై చంద్రబాబు చిన్నచూపు

చేనేతపై చంద్రబాబు చిన్నచూపు

ఏడాదికి రూ.25 వేలు చెల్లింపు ఎప్పుడో బడ్జెట్‌లో కనిపించని కేటాయింపు హ్యాండ్లూమ్‌కు 200 యూనిట్లు, పవర్‌ లూమ్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ మొక్కుబడే అంటున్న నేతన్నలు 22న మంగళగిరిలో చేనేత గర్జన

చెప్పిన మాటలే అమలు చేయమంటున్నాం ..

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలు..

కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి..

చీరాల అర్బన్‌: చంద్రబాబు మరోమారు తన మార్కు రాజకీయం ప్రదర్శించారు. ఆయనకు చేనేత రంగంపై చిన్నచూపు ఉందనేది మరోసారి రుజువైంది. బడ్జెట్‌లో చేనేత రంగానికి కేటాయించిన నిధులే అందుకు నిదర్శనమని ఆ రంగానికి చెందిన పలువురు మండిపడుతున్నారు. ఏడాదికి రూ.25 వేలు ఇస్తామని నేతన్నలకు ఎన్నికల వేళ నమ్మబలికారు. ఓట్లు దండుకున్నారు. అధికారం వచ్చాక ఆ సంగతే మర్చిపోయారు. ఏప్రిల్‌ 1 నుంచి హ్యాండ్లూమ్‌కు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అనేది కూడా ఎంత వరకు అమలు చేస్తారో సందేహమేననే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 22వ తేదీ రాష్ట్ర చేనేత జనసమాఖ్య ఆధ్వర్యంలో చలో మంగళగిరి (చేనేత గర్జన) పేరుతో హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోరుతూ నేతన్నలు గర్జించనున్నారు.

జిల్లాలో లక్ష మందికిపైగా చేనేత రంగంపై ఉపాధి...

జిల్లాలో సుమారు లక్ష మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా చేనేత రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏడాదికి రూ.25 వేలు అందజేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం జగన్‌ నేతన్న నేస్తం పేరుతో ఏడాదికి రూ.24 వేలు మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు క్రమం తప్పకుండా అందజేశారు. అయితే ఎన్నికల వేళ చంద్రబాబు, కూటమి నేతల కల్లబొల్లి మాటలు నమ్మి తాము మోసపోయామని, ఇప్పుడు చింతిస్తున్నామని సగటు చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఊసే లేని ఉపవృత్తులు...

బడ్జెట్‌ కేటాయింపులో మగ్గం ఉన్న వారికి కంటితుడుపుగా 200, 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. అయితే, చేనేత ఉప వృత్తుల వారి ఊసే లేకుండా పోయింది. మగ్గంపై నేత నేసేందుకు ముందస్తుగా ముడి నూలును డైయింగ్‌, అచ్చు, ఆసు, పడుగులు, పాగళ్లు ఇలా వివిధ దశల్లో ఉపవృత్తుల వారు సానుకూలం చేస్తారు. ఆ తర్వాత ఆ దారం మగ్గంపై నేతకు అనుకూలం అవుతుంది. చేనేత రంగంలో ఇలా క్రియాశీలకంగా ఉండే చేనేత ఉపవృత్తులను విస్మరించటం సరికాదని, తమను పరిగణలోకి తీసుకుని సంక్షేమ పథకాల ఫలాలు అందించాలని వారు కోరుతున్నారు.

22న చలో మంగళగిరి (చేనేత గర్జన)...

తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 22వ తేదీన చలో మంగళగిరి (చేనేత గర్జన)కు చేనేత రంగానికి చెందిన ప్రతిఒక్కరు కదలి రావాలని రాష్ట్ర చేనేత జనసమాఖ్య ఇప్పటికే పిలుపునిచ్చింది. అందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు జరుపుతున్నారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చేనేత కార్మికులను జాగృతం చేస్తున్నారు.

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు సమాధానం చెప్పాలి...

అత్యధికంగా చేనేత రంగానికి చెందిన వారు ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి నేతన్నల ఓట్లతో గెలుపొందిన మంత్రి లోకేష్‌ తమ సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని ఆ రంగ ప్రతినిధులు అంటున్నారు.

చేనేత దత్త పుత్రుడని చెప్పుకున్న లోకేష్‌.. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, నేతన్నలు తన ఆత్మబంధువులని చెప్పుకున్న సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని సగటు చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

ఏడాదికి రూ.25 వేలు ఇస్తామన్న హామీ నెరవేరలేదు. చంద్రబాబు సర్కార్‌ ఇచ్చిన హామీలనే నెరవేర్చమని డిమాండ్‌ చేస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను విస్మరించటాన్ని ఏమనాలో వారే చెప్పాలి.

– బండారు జ్వాలానరసింహం,

ఆలిండియా హ్యాండ్లూమ్స్‌ అండ్‌ హ్యాండీ

క్రాప్ట్స్‌ రైట్స్‌ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు

ప్రభుత్వ పరంగా అందే మార్గదర్శకాల ప్రకారం మేం పని చేస్తాం. మా వంతు బాధ్యతగా ఎప్పటికప్పుడు స్థితిగతులను ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం. మా పరిధిలో మేం మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేస్తున్నాం.

– రఘనందన్‌, హ్యాండ్లూమ్స్‌ ఏడీ, చీరాల

చేనేత రంగ సమస్యల పరిష్కారానికి బడ్జెట్‌లో కనీసం రూ.1000 కోట్లు కేటాయించాలి. అలాంటిది కేవలం రూ.200 కోట్లు కేటాయించటం చేనేత రంగంపై చిన్నచూపునకు నిదర్శనం. త్రిఫ్ట్‌ ఫండ్‌ స్కీం అటకెక్కించారు. ఐసీఐసీఐ లాంబార్డ్‌ హెల్త్‌ కార్డు స్కీం లేదు. సొసైటీల బకాయిల చెల్లింపు లేదు. ఏడాది రూ.25 వేలు సంక్షేమం కింద చెల్లిస్తామని చెప్పారు. అదీ లేదు. చేనేత రిజర్వేషన్‌ చట్టం అమలు నామమాత్రంగా కూడా లేదు. హ్యాండ్లూమ్‌కు 200 యూనిట్లు, పవర్‌ లూమ్‌కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ప్రకటించారు. అది పరోక్షంగా పవర్‌లూమ్‌ను ప్రోత్సహిస్తున్నట్లే. అన్ని సమస్యల పరిష్కారం కోసమే 22న చలో మంగళగిరి (చేనేత గర్జన)కి పిలుపునిచ్చాం. చేనేత రంగానికి చెందిన ప్రతిఒక్కరూ తరలిరావాలని కోరుతున్నాం. అప్పుడే పాలకులకు కళ్లు, చెవులు పనిచేస్తాయి.

– దేవన వీరనాగేశ్వరరావు, రాష్ట్ర చేనేత జనసమాఖ్య అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement