బాలకోటయ్యా... నిను చేరేదెలా? | - | Sakshi
Sakshi News home page

బాలకోటయ్యా... నిను చేరేదెలా?

Feb 12 2026 7:26 AM | Updated on Feb 12 2026 7:26 AM

బాలకోటయ్యా... నిను చేరేదెలా?

బాలకోటయ్యా... నిను చేరేదెలా?

గుంతలమయంగా అరవపల్లి రహదారులు మరమ్మతులు చేయాలంటున్న భక్తులు

రేపల్లె: మహాశివరాత్రిని పురస్కరించుకుని అరవపల్లి గ్రామంలో వేంచేసియున్న బాలకోటేశ్వరస్వామి తిరునాళ్లను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. స్వామివారు ఈ క్షేత్రంలో వెలసిన నాటి నుంచి భక్తులు అపార భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. దాదాపు 300 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న ఈ ఆలయానికి చేరాలంటే భక్తులకు తిప్పలు తప్పటంలేదు.

దూరప్రాంతాల నుంచి భక్తుల రాక...

మహాశివరాత్రి రోజున పరిసర గ్రామాల నుంచే కాకుండా ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు, జాగరణ వంటి కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. తిరునాళ్ళను పురస్కరించుకుని రేపల్లె పట్టణంతో పాటు చుట్టు పక్కల పెదఅరవపల్లి, నల్లూరుపాలెం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలోనే భక్తులు ప్రభలను కట్టుకుని బాలకోటయ్యను దర్శించేందుకు వస్తుంటారు. ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకునే ప్రధాన రహదారి అధ్వాన్నంగా ఉండటంతో ప్రభలను ఆలయం వద్దకు సురక్షితంగా తరలించటం కష్టమవుతుందని భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

రహదారులకు త్వరితగతిన మరమ్మతులు నిర్వహించాలి..

ప్రత్యేకంగా పండుగ సమయాల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చే నేపథ్యంలో రహదారి మరమ్మతులు చేపట్టకపోవడం పట్ల గ్రామస్తులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, ఇతర వాహనాలు కూడా ఆలయానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, బాలకోటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారిని శాశ్వతంగా మరమ్మతులు చేయాలని భక్తులు కోరుతున్నారు. స్వామివారి తిరునాళ్లు మరింత వైభవంగా సాగాలంటే మౌలిక వసతుల కల్పన అత్యవసరమని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement