వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుపై రాజకీయాలొద్దు
బాపట్ల: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ఏర్పాటుపై రాజకీయ జోక్యం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలంలో మరో విగ్రహం ఏర్పాటు చేయటాన్ని నిరసిస్తూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డిని బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆనాటి శంకుస్థాపన ఫొటోలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోకి రాఘవరెడ్డి మాట్లాడుతూ.. బాపట్లలోని జాతీయ రహదారిలో కర్లపాలెం వెళ్లే కూడలి ప్రాంతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం నిర్మించేందుకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కోర్టు వివాదంతో నిర్మాణ పనులు నిలుపుదల చేశారన్నారు. అప్పుడు ఉన్న నిబంధనలు ఇప్పుడు వర్తించకపోవటం బాధాకరమన్నారు. విగ్రహాలు ఏర్పాటుపై ఇష్టానుసారం వ్యవహరించటం, రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా వైఎస్సార్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత స్థలం జోలికి రావద్దంటూ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శి చేజర్ల నారాయణ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా స్పోక్స్‌పర్సన్ గవిని కృష్ణమూర్తి, మాజీ ఎంపీటీసీ మచ్చా శ్రీనివాసరెడ్డి, నాయకులు జోగి రాజా, గోపి తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు
కోకి రాఘవరెడ్డి


