అక్రమ ఆదాయమే అభివృద్ధా..
వైఎస్సార్ సీపీ హయాంలో శంకుస్థాపన చేసిన పనులనే ఇప్పుడు చేస్తున్నారు
రేషన్, ఇసుకపై వచ్చే ఆదాయం ఎటు వెళ్తోంది!
సీబీఐ, సిట్ చెప్పినా కల్తీ
జరిగిందంటూ దుష్ప్రచారం
హ్యాండ్‌లూమ్ పార్కు స్థలం వ్యవహారం గురించి తెలుసా..?
ఆటోనగర్‌లో రోడ్లు, విద్యుత్ స్తంభాలు వేయించింది వైఎస్సార్ సీపీనే..
ప్రశాంత చీరాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు
మీడియా సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు
చీరాల: వైఎస్సార్ సీపీ హయాంలో పనులు ప్రస్తుతం చేస్తూ వాటినే అభివృద్ధి అంటే ఎవరూ నమ్మరని, రేషన్ బియ్యం, ఇసుక వ్యవహారంలో వచ్చే ఆదాయం ఎటు వెళుతుందో ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మేరిబాబు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో తానే ఎంతో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చెప్పడంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే చీరాల్లో ఓ యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చారని చెప్పారు. ఈ ఘటనపై ఇంత వరకు చర్యలు లేవన్నారు. ఇటీవల కాల్‌మనీ వ్యవహారంలో తల్లి, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని, చికిత్స పొందుతూ ఇచ్చిన వాగ్మూలంలోని వ్యక్తులపై ఏం చర్యలు తీసుకున్నారన్నారు. గత ఏడాది వాన్‌పిక్ భూముల్లో అక్రమంగా ఇసుక తరలించడంపై జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి విచారణ చేసి రూ.51 లక్షలు జరిమానా వేసిందన్నారు. రేషన్ బియ్యంలో నెలకు రూ.25 లక్షలు ఎవరికి చేరుతుందో పరిశీలించుకోవాలని కోరారు. చీరాలను మినీ గోవాగా తీర్చిదిద్దుతామని అసెంబ్లీలో చెప్పారన్నారు. అయితే సముద్రతీరంలో రిసార్ట్స్‌కు వచ్చి చనిపోయినవారు ఎవరూ లేరని, సముద్రంలో ముగిని పర్యాటకులు చనిపోయారన్నారు. అయితే రిసార్ట్స్ యజమానులందరినీ ఐక్యం చేసి పర్యాటకుల భద్రత పేరుతో నిధులు వసూలు చేశారన్నారు. అయితే నిధులు వసూలు చేసిన తర్వాత కూడా ఎంతోమంది సముద్రంలో మునిగి చనిపోయారన్నారు. అలానే కౌన్సిలర్ బత్తుల అనిల్ మాట్లాడుతూ మండలంలోని బుర్లవారిపాలెం, అక్కాయిపాలెం రైతుల సమస్య దృష్ట్యా కరణం బలరామకృష్ణమూర్తి కృషితో మురుగునీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయించామని వివరించారు. ఇప్పటి వరకు రెండో వైస్ చైర్మన్ నోటిఫికేషన్ రాకుండా చేశారన్నారు. చీరాల్లో హ్యాండ్‌లూమ్ పార్కు స్థల వ్యవహారం గురించి తెలుసుకోవాలని కోరారు. కరణం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేరే వ్యక్తులు ఆ స్థలాన్ని ఇతర పనులకు వినియోగించాలని చూస్తే కరణం బలరామకృష్ణమూర్తి హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చి ఆ స్థలాన్ని కాపాడారన్నారు.
ఆర్వోబీ తీసుకొస్తే..
మున్సిపాలిటీ పరిధిలో రూ.9 కోట్లతో విద్యుత్ స్తంభాలు వేయించామన్నారు. రూ.73 కోట్లతో ఆర్వోబీని తీసుకువస్తే అది గుంటూరుకు తరలిపోయిందని.. ఎమ్మెల్యేనే అసెంబ్లీలో మాట్లాడారని నాయకులు తెలిపారు. వాడరేవులో రూ.400 కోట్లతో గత ప్రభుత్వంలో పోర్టు చేయాలని గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎంతో మాట్లాడి పోర్టు తీసుకువస్తే ప్రస్తుతం అది ఎటుపోయిందో తెలియదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గోసాల అశోక్, రైతు విభాగం కన్వీనర్ కావూరి రమణారెడ్డి, కౌన్సిలర్ గుంటూరు ప్రభాకరరావు, పట్టణ ఉపాధ్యక్షులు జాన్ చిరంజీవి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, రమేష్ పాల్గొన్నారు.


