మాల్‌కీలాద్రి..!
కేసులు నమోదుకు కూడా ప్రత్యేక పంథానే...!
చంద్రబాబు ప్రభుత్వంలో...
చీరాల నియోజకవర్గంలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
చీరాల– టు –కొత్తపట్నం, గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లకు తరలుతున్న రేషన్‌బియ్యం
గతంలో పట్టుబడ్డ సందర్భాలు అందుకు నిదర్శనం
మొక్కుబడిగా అధికారుల దాడులు... నామమాత్రంగా కేసులు
రేషన్ మాఫియా కీలక పాత్రధారి మార్క్ మంత్రాంగం
అందుకు పచ్చనేత అండ... ప్రతిగా నెలకు రూ.20 లక్షలు లబ్ధి...!
మా విధులు మేం నిర్వహిస్తున్నాం
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ బియ్యం నల్లబజారుకు తరలించే మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. అయినా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. ఈ అక్రమ రవాణాను చంద్రబాబు ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లబజారుకు తరలించే రేషన్ బియ్యంలో పట్టుబడేది ఐదు శాతం కూడా ఉండదని, 95 శాతంపైగా మిల్లులు, పోర్టులకు తరలుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విజి‘లెన్స్’శాఖ పనితీరుపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. – చీరాల అర్బన్
చీరాల నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలుతున్నాయని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మాల్యాద్రి అనే వ్యక్తి ప్రధాన పాత్రధారని, అతనికి పచ్చ నేత అండ సంపూర్ణంగా ఉందని, అందుకు ప్రతిగా పచ్చనేతకు ప్రస్తుతం నెలకు రూ.20 లక్షలు అందుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసులు నమోదులోనూ మాల్యాద్రి మార్క్ మంత్రాంగం
రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. అయితే కార్డుదారుల నుంచి డీలర్లు కొంటున్నారు. డీలర్లు నుంచి మేం కొంటున్నాం. మిల్లర్లుకు, లేదా విదేశాలకు తరలించేందుకు పోర్టులకు తరలిస్తుంటాం. ఇందులో తప్పేంటని మాల్యాద్రి అండ్ కో అంటుంటారనే ప్రచారం ఉంది. ఇక సంబంధిత అధికారులకు, అక్రమార్కులకు మధ్య ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తూ, చీరాలతో అవినాభావ సంబంధం ఉన్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఆ క్రమంలో అప్పుడప్పుడు కేసులు నమోదుకు సంబంధించి సదరు అక్రమార్కులే ఏ డీలర్లు మీద 6ఏ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు చేయాలనేది చెబుతుంటారని వినికిడి. అధికారులు తమ బాధ్యతను నిర్వహిస్తున్నారని చెప్పుకోవటానికి, ఏఏ డీలర్లు అయితే తమకు సరుకు ఇవ్వరో వారిని భయపెట్టేందుకు అక్రమార్కులకు ఉభయతారకంగా ఆ పని చేస్తుంటాయని విషయం తెలిసిన వారు అంటున్నారు.
కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం
గతంలో రేషన్ బియ్యం నల్లబాజరుకు తరలించే క్రమంలో పలుమార్లు పట్టుబడ్డ వారికి సంబంధించి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసేందుకు సంబంధిత అధికారులు ఫైల్ సిద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రేషన్ బియ్యం నల్లబజారుకు తరలకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టాలంటే జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
దాడులు చేస్తున్నాం ... కేసులు కడుతున్నాం
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి డీఎస్‌ఓ జమీర్ బాషాను ఫోన్‌లో వివరణ కోరగా, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి దాడులు చేస్తున్నాం. కేసులు కడుతున్నామని చెప్పారు. అయితే ఇప్పటికి మీరు ఎన్ని దాడులు నిర్వహించారు, ఎన్ని కేసులు కట్టారనే ప్రశ్నకు జవాబు దాట వేస్తూ, ఆ విషయాలు మీరు స్థానిక తహసీల్దార్, అక్కడి అధికారులను అడగాలని చెప్పారు. అందరికి సమాధానం చెప్పలేక పోతున్నామన్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఫీల్డ్‌లో కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక పంథాతో మాల్యాద్రి మార్క్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఓ పాత ఆటోలో 30 లేదా 40 బస్తాలు రేషన్ బియ్యం ఉంచి నల్లబజారుకు తరలించే క్రమంలో పట్టుకున్నట్లు, సంబంధికులపై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదు చేసేటట్లు చేయటం ప్రత్యేకతని ప్రచారం జరుగుతోంది. చీరాల నుంచి గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లకు, కొత్తపట్నం మిల్లులకు అక్రమంగా తరలిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
గతంలో డీఎస్‌ఓ, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీలు, గస్తీ ముమ్మరంగా ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నల్లబజారుకు తరలుతున్న రేషన్ బియ్యంపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతానికి ఇప్పటికి నమోదవుతున్న కేసులు అందుకు నిదర్శనమంటున్నారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి మా విధులు మేం నిర్వహిస్తున్నాం. మా పరిధిలో 20 నియోజకవర్గాలు ఉంటాయి. ప్రత్యేకంగా చీరాల అని చెప్పలేం కానీ మేం దాడులు నిర్వహిస్తున్నాం. పలు చోట్ల పెద్ద మొత్తాల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాలు పట్టుకుని సీజ్ చేశాం. కేసులు నమోదు చేశాం. అలానే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంక్వయిరీలకు సంబంధించి అన్ని నివేదికలు సమర్పించాం. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేవారు ఎవరైనా ఉపేక్షించం.
– చంద్రశేఖర్, సీఐ, విజిలెన్స్ అండ్
ఎన్‌ఫోర్స్‌మెంట్, గుంటూరు.


