సున్నా వడ్డీకి మంగళం
సున్నా వడ్డీ అందజేయాలి
క్రాఫ్ రుణాలు సకాలంలో చెల్లించినా పైసా విదల్చని ప్రభుత్వం
వేటపాలెం: రైతులు పంటల సాగు కోసం తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తే ఇస్తున్న సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు రూ.18 నెలల కాలంలో ఇప్పటి వరకూ నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దాదాపు లక్ష పైచిలుకు మంది రైతులు నష్టపోయారు.
అన్నదాతలకు ఎంతో మేలు చేసే ఈ పథకానికి 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తాను నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రలో పంట పెట్టుబడి కోసం రైతులు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు. అప్పటి వరకు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను ఒక్క సంతకంతో మాఫీ చేశారు. ఆ తరువాత రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తామని ప్రకటించారు. ఈ పథకం కింద పంట రుణాలు తీసుకున్న రైతుల నుంచి ఏడాదికి వసూలు చేసే వడ్డీలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చొప్పున భరిస్తున్నాయి. తద్వారా రైతులపై వడ్డీ భారం పడదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులకు ఐదేళ్లూ పూర్తి వడ్డీ రాయితీ అందించి ఎంతో మేలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలును పూర్తిగా నీరుగార్చింది.
జిల్లాలోని జాతీయ, గ్రామీణ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పరిధిలో దాదాపు లక్ష మందికిపైగా రైతులు వివిధ పంటల సాగు కోసం సుమారు రూ.600 కోట్ల రుణాలు పొందారు. ఇందులో సన్న, చిన్నకారు రైతులు రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకున్న పంట రుణాలకు వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీకి ఎగనామం పెట్టడం వల్ల అసలుతోపాటు మొత్తం వడ్డీ రైతులే చెల్లించాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏటా రుణాలు సక్రమంగా చెల్లించే ప్రతి రైతుకు క్రమం తప్పకుండా రూ.3 వేల చొప్పున వడ్డీ రాయితీ ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద ఇవ్వాల్సిన రూ.4 వేల వడ్డీ రాయితీని 18 నెలలుగా ఇవ్వడం లేదు. ఈ విధంగా జిల్లాలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.190 కోట్ల మేరకు వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉందని సమాచారం. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేస్తే ఆ మొత్తాన్ని తిరిగి జమ చేస్తామని చెబుతూ బ్యాంకులతోపాటు సొసైటీలు రైతు నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఎవరైనా రైతులు వడ్డీ చెల్లించకపోతే వారికి రుణాలిచ్చేందుకు ఆయా బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో కొంత మంది రైతులు బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తున్నారు. అలా చెల్లించలేనివారు తమకు పంట రుణాలు ఏ విధంగా వస్తాయో అర్థంగాక ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గతేడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకులకు వెళ్తే.. ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పారు. గతేడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.
–డీ వసుంధర, మహిళా రైతు, వేటపాలెం
ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతోపాటు ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారులు రుణాలు సకాలంలో చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వడ్డీ కూడా చెల్లిస్తున్నాం.
–బలరామిరెడ్డి, రైతు, వేటపాలెం
సున్నా వడ్డీకి మంగళం


