జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
వెట్టి చాకిరీ రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దుదాం
బాపట్ల: వెట్టి చాకిరి రహిత జిల్లాగా బాపట్లను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. వెట్టి చాకిరి నిర్మూలన చట్టం అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా బాండెడ్ లేబర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, కార్మిక శాఖ షాడోస్ డీబీఆర్‌సీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఆర్‌డీ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో పోస్టర్లను జిల్లా కలెక్టర్ వి వినోద్‌కుమార్ సోమవారం ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టి చాకిరి ఒక అమానుష సామాజిక దురాచారమని, దీనిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం 1976లో వెట్టి చాకిరి నిర్మూలన చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. చట్టం అమలులోకి వచ్చి ఐదు దశాబ్దాలు గడిచాయని, బాపట్ల జిల్లాను వెట్టిచాకిరి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలనీ పిలుపునిచ్చారు. జిల్లా కార్మిక శాఖ ఏసీఎల్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు గౌరవంగా, స్వేచ్ఛతో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని, వెట్టి చాకిరి చట్టవిరుద్ధమే కాకుండా మానవ హక్కుల ఉల్లంఘన అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, షాడోస్ ప్రతినిధులు రాజాసల్మాన్, భాగ్యలక్ష్మి, అలేఖ్య, డీబీఆర్‌సీ ప్రతినిధులు శ్రీలత, భగవాన్‌దాస్, ఎస్‌ఎఫ్‌ఐ ఆర్‌డీ ప్రతినిధులు కిశోర్, తిరుపతిరావు, సుజని తదితరులు పాల్గొన్నారు.


