రోగులను బాదేస్తున్నారు
జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలి...
కమీషన్‌ల కోసం
● అవసరం లేకుండానే వైద్య పరీక్షలు
● నియంత్రణలేని వైద్య పరీక్షల ఫీజులు
● కొంత మంది వైద్యుల్లో
లోపిస్తున్న నైతిక ప్రాక్టీస్
గుంటూరు మెడికల్: గుంటూరు శ్రీనివాసరావుతోటకు చెందిన సాంబయ్య అనే వ్యక్తి జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ గుంటూరు కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం చేరాడు. అతడికి సుమారు 15 రకాల వైద్య పరీక్షలు రాసి వారం రోజులకు రూ.లక్షన్నర బిల్లు వేయటంతో ఖంగుతిన్నాడు.
● పల్నాడు జిల్లాకు చెందిన ఖాసిం అనే వ్యక్తి తలనొప్పితో బాధపడుతూ స్పెషాలిటీ వైద్యుల కోసం గుంటూరు నగరంలోని ఓ వైద్యుడిని సంప్రదించాడు. ఖాసిం గదిలోపల ఉన్న వైద్యుడి వద్దకు వెళ్ళక ముందే అక్కడ పనిచేసే కిందిస్థాయి ఉద్యోగులు ఎమ్మారై స్కాన్, రక్తపరీక్షలు చేయించుకు రావాలని కాగితంపై రాసి ఇచ్చారు. ఈ పరీక్షలకు రూ.15వేలు ఖర్చు కావడంతో ఖాసింకు తలతిరిగిపోయింది.
ఆ తరువాత డాక్టర్ ఫీజు, మందులు, అన్నీ కలుపుకుని ఒక్కరోజులోనే రూ.20 వేలు ఖర్చు కావడంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఖాసిం బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. ఇలా ప్రతిరోజూ ఎంతో మంది రోగులు వివిధ రకాల స్పెషాలిటీ వైద్యుల వద్దకు వెళ్ళి జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. ఆస్పత్రి నిర్వాహకులకు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులు మధ్య కమీషన్ ఒప్పందం ఉండటంతో అవసరం లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు రాసి రోగులకు వైద్యం తడిసి మోపెడయ్యేలా చేస్తున్నారని పలువురు సీనియర్ వైద్య నిపుణులే వాపోతున్నారు. కొంత మంది వైద్యులు కమీషన్ల కోసం కక్కుర్తి పడుతూ రోగి ముఖం కూడా చూడకుండానే వైద్య పరీక్షలు రాస్తున్నారు. కొంత మంది రోగులను వైద్యుల వద్దకు కూడా వెళ్ళనీయకుండా డాక్టర్ వద్ద పనిచేసే అసిస్టెంట్లు వివిధ రకాల టెస్ట్‌ల పేరుతో దోచుకుంటున్నారు.
ఎమ్మారై, సిటీ స్కాన్‌లో సగానికి
పైగా వైద్యులకే...
ఎమ్మారై, సిటీ స్కాన్ లాంటి వైద్య పరీక్షలకు రోగుల వద్ద నుంచి వసూలు చేసే ఫీజులో సగానికి పైగా రోగిని తమ వద్దకు పరీక్ష కోసం పంపిన వైద్యులకే అందజేస్తున్నామని స్కాన్ సెంటర్స్ నిర్వాహకులు తెలుపుతున్నారు. సిటీ స్కాన్ పరీక్ష కోసం రూ.5 వేలు నుంచి రూ.10వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు. అందులో సగానికి పైగా డాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఎమ్మారై స్కానింగ్ కోసం రూ.10వేల నుంచి రూ. 20వేలు వరకు వసూలు చేసి సగం డబ్బులు వైద్యులకు కమీషన్ రూపంలో అందజేస్తున్నారు. ల్యాబ్‌లలో చేసే వివిధ రకాల రక్త పరీక్షలకు వసూలు చేసే ఫీజులో 40 నుంచి 60 శాతం వరకు వైద్యులకు ముట్టచెబుతున్నారు. సాయంత్రానికి వారికి కమీషన్ పంపించాలని లేకపోతే రెండో రోజు తమ స్కానింగ్ సెంటర్ లేదా ల్యాబ్‌కు సదరు వైద్యులు రోగులను పంపటం లేదని స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులు తెలిపారు. కమీషన్లు తీసుకోకుండా జీజీహెచ్ వైద్యులకు తాము పంపే రోగికి కేవలం రూ.3వేలకే సిటీ స్కాన్ పరీక్ష, రూ.5వేలకు ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అల్లోపతిక్ ప్రైవేటు మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్) యాక్ట్–2002 ప్రకారం వైద్యులు ఏ రోగానికి ఎంత మేరకు ఫీజులు తీసుకుంటున్నారో నోటీస్ బోర్డులో తెలియజేయాల్సి ఉంది. చాలా ఆస్పత్రుల్లో అలాంటి బోర్డులు కనిపించటం లేదు. కొంత మంది వైద్యులు నోటీస్ బోర్డుల్లో ఫీజులు వివరాలు పెట్టినా వాటికి కంటే అధికంగా వసూలు చేస్తూ ప్రజలను పిండేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించి అల్లోపతిక్ చట్టం అమలు జరిగేలా, వైద్యుల అనైతిక ప్రాక్టీస్‌కు చెక్‌పెట్టి రోగులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.


