యువత చేతుల్లోనే దేశ భవిష్యత్
ఏపీ ఈగల్ ఛీప్ ఐజీపీ ఆకే. రవికృష్ణ
బాపట్ల టౌన్: దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని, దేశాన్ని ప్రేమించేవారు డ్రగ్స్‌ను ఉపయోగించరని ఏపీ ఈగల్ ఛీప్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. శనివారం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ, రమేష్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ పేరిట అవగాహన ర్యాలీని, వాక్‌థాన్‌ను ఆకే రవికృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ బాపట్ల పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమై ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు సాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వాడటం వలన దేశ భద్రతను కూడా ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ 1972కి తెలియజేయాలని కోరారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2వేలకు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, బాపట్ల ఏఎస్పీ గోగినేని రామాంజనేయులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, జనసేన కన్వీనర్ శ్రీమన్నారాయణ, రమేష్ హాస్పిటల్ హెచ్‌ఆర్ ప్రతినిధి భారత్, ఫౌండర్ సమంత, కో ఆర్డినేటర్ నరేష్, ఈగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.


