కేంద్ర బడ్జెట్‌లో పేదలు, దళితులకు అన్యాయం
ముగిసిన ఏఐడీఆర్‌ఎం జాతీయ సమితి సమావేశాలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కొత్తపేట మల్లయ్య లింగం భవన్‌లో ఏఐడీఆర్‌ఎం(ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూమెంట్) – డీహెచ్‌పీఎస్ జాతీయ సమితి సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన ముగింపు సమావేశానికి ఏఐడీఆర్‌ఎం జాతీయ అధ్యక్షుడు ఎ.రామ్మూర్తి అధ్యక్షత వహించారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి వి.ఎస్.నిర్మల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పేదలకు, దళితులకు వ్యతిరేకంగా ఉందన్నారు. ‘సర్’ పేరుతో పేదల ఓటు హక్కును హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్ కలిసి దళితులపై దాడులకు పాల్పడుతున్నాయని, గత సంవత్సరంలో 76 వేలకుపైగా దళితులపై దాడులు జరిగాయని చెప్పారు.
పలు కీలక తీర్మానాలు..
భవిష్యత్ కార్యాచరణలో భాగంగా జాతీయ సమితి సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం–1989ను రక్షించాలి, నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా చట్టాన్ని మరింత కఠినం చేయాలి. ఎంఎన్‌ఆర్‌జీఏ బదులుగా తీసుకొచ్చిన జి–రామ్–జి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేలా కేంద్ర చట్టం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గుల్జార్ సింగ్ గోరియా (బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి), కరవది సుబ్బారావు (దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), జె.వి.ప్రభాకర్, బి.రాయప్ప, కోట మాల్యాద్రి (సీపీఐ జిల్లా కార్యదర్శి), మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


