విద్యార్థుల శ్రేయస్సును విస్మరిస్తే ప్రైవేటు పాఠశాలలపై
గుంటూరు ఎడ్యుకేషన్ : విద్యార్థుల శ్రేయస్సుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో షేక్ సలీమ్ బాషా హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గుంటూరు పాత బస్టాండ్ సెంటర్‌లోని జిల్లా పరీక్షా భవన్‌లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ విద్యార్థులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదని స్పష్టం చేశారు.
వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అనైతిక అడ్మిషన్లకు పాల్పడుతున్నాయని, ఒక పాఠశాలలో విద్యార్థులను మరొక పాఠశాలలో చేర్చుకుని, ఫీజుల విషయంలో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విధమైన చర్యలతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడటంతోపాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోందన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన విధి, విధానాల ప్రకారం పాఠశాలలు నిర్వహించాల్సిందేనని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష ఫీజులు వసూలు చేయడం తగదని స్పష్టం చేశారు.
నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెనాలి డీవైఈవో శాంతకుమారి, గుంటూరు తూర్పు ఎంఈవో నాగేంద్రమ్మ, డీసీఈబీ కార్యదర్శి ఏ. తిరుమలేష్, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
వలస కుటుంబాల్లోని పిల్లలకు
విద్య నేర్పించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వలస కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందించడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గుంటూరులోని మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పిల్లలకు విద్యనందిస్తున్న వలంటీర్లు, కేర్ టేకర్లకు కెపాసిటీ బిల్డింగ్. కార్యక్రమాన్ని మంగళవారం సాంబశివపేటలోని సెయింట్ జోసఫ్ బీఈడీ కళాశాలలో ప్రారంభించారు.
● ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందించడం మన బాధ్యత అని అన్నారు.
● ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల్లో బిహార్ వాసులు అత్యధికంగా ఉన్నారని, వారి పిల్లలకు లెర్నింగ్ సపోర్ట్ ఇచ్చే విషయమై బిహార్ నుంచి ప్రథమ్ ఎన్జీవో టీం ప్రత్యేకంగా వచ్చారని, సంబంధిత ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రథమ్ టీంతో సమన్వయం చేసుకుని మూడు రోజులపాటు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు.
● బిహార్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలకు, ఇక్కడి పిల్లల స్వభావంతో భిన్నంగా ఉన్నాయని, ప్రధానంగా భాషకు సంబంధించిన సమస్య ఉత్పన్నమవుతోంద్నారు.
● గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ ఐ.పద్మావతి మాట్లాడుతూ ఎన్‌సీపీసీఆర్ గైడెన్స్, సమగ్రశిక్ష ఎస్పీడీ ఆదేశాల మేరకు గత సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వే ద్వారా వలస కుటుంబాల్లోని 2,196 మంది పిల్లల వివరాలు సేకరించామని, వారికి విద్యను కొనసాగించేందుకు అవసరమైన లెర్నింగ్ సపోర్ట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ్ టీం కంటెంట్ ప్రతినిధి లీలా పద్మావతి, బిహార్ ప్రథమ్ టీం ప్రతినిధి దీనానాద్ కుమార్ సిన్హా, గుంటూరు ఈస్ట్ ఎంఈవో ఎస్‌ఎంఎం అబ్దుల్ ఖుద్దూస్ పాల్గొన్నారు.
గుంటూరు డీఈఓ సలీమ్ బాషా


