రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు సర్వం సిద్ధం
19 నుంచి మూడురోజులపాటు నిర్వహణ గ్రామస్తులు, దాతల సహకారంతో పోటీలకు ఏర్పాట్లు పోటీల నిర్వహణలో దేశస్థాయిలో ప్రత్యేక గుర్తింపు
జె.పంగులూరు: ఈ నెల 19 నుంచి 21 వరకు స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలోని క్రీడా ప్రాంగణంలో 44వ రాష్ట్రస్థాయి బాలబాలికల (18 సంవత్సరాల లోపు) ఖోఖో పోటీలు జరగనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, కె హనుమంతరావు తెలిపారు. స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల క్రీడాప్రాంగణంలో ఆదివారం కేకేఎఫ్‌ఐ ఉపాధక్షుడు ఎం.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో వివరాలు వెల్లడించారు. డాక్టర్ బాచిన చెంచుగరటయ్య మాట్లాడుతూ 19 నుంచి మూడు రోజుల పాటు జరగబోవు 44వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల నిర్వహణలో గ్రామస్తుల పాత్ర ఎంతో ఉందన్నారు. 1993 నుంచి పంగులూరులో 12 రాష్ట్ర, 4 జాతీయ స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఖోఖో నిర్వహణలో పంగులూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అతి త్వరలో రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇపాటికే కళాశాల క్రీడా ప్రాంగణంలో ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఖోఖో కార్యదర్శి కె.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 ఉమ్మడి జల్లాల నుంచి బాలబాలికలు 390 మంది క్రీడాకారులు వస్తారన్నారు. టీమ్‌లతో పాటు కోచ్, మేనేజర్స్ 52 మంది, అసోసియేషన్ సెక్రటరీలు 26 మంది క్రీడల నిర్వహణకు 150 మంది వలంటీర్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తారన్నారు. 13 జిల్లాల నుంచి వచ్చే 195 మంది బాలురకు జూనియర్ కళాశాలలో వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 13 జిల్లాల నుంచి వచ్చే 195 బాలికల కోసం గ్రామస్తులు వారికి వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీంతో వచ్చే కోచ్‌లకు, మేనేజర్లకు చర్చి ప్రాంగణంలో, రోటరీ క్లబ్‌లో వసతి కల్పించినట్లు తెలిపారు. వచ్చిన వారికి భోజన వసతులు పంగులూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు రఘుబాబు, గ్రామ పెద్దలు రావూరి రమేష్, చౌదరి బాబు, ఆర్‌వీ సుబ్బారావు, రంగారావు, బాచిన నాగార్జున, ఐ. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


