రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
సంతమాగులూరు(అద్దంకి): రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని నామ్ రహదారిలోని ఏల్చూరు వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఏల్చూరుకు చెందిన కొండి వెంకట ఆంజనేయులు (19) పల్సర్ ద్విచక్ర వాహనంపై గ్రామంలోకి వస్తున్నాడు. హిందూ శ్మశాన వాటిక దాటి ముందు వెళ్తున్న లారీ పక్కగా వస్తుండగా, అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ క్రమంలో లారీ ముందు టైరు కిందపడి చేయి నుజ్జయింది. తలకు, పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రదేశంలో ఉన్న స్థానికులు పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ లారీని నిలిపివేశాడు. సమాచారం అందుకున్న సంతమాగులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడని టోల్ ప్లాజా అంబులెన్సు సిబ్బంది నరసరావుపేట తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఏడు నెలల క్రితం యువకుడి తండ్రి వెంకట్రావు అకాల మరణం చెందాడు. అదే కుటుంబంలో కొడుకు చనిపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


