‘బంగారం’లాంటి మనసు చాటిన పోలీసులు
గొలుసు వెతికి అప్పగించడంతో వృద్ధురాలి ఆనందం
కారంచేడు: ఒంటరిగా జీవిస్తున్న వృద్ధురాలికి చెందిన బంగారు గొలుసు రెండు రోజులుగా కనిపించకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెతికి ఆమెకు అప్పగించారు. ఈ ఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్వర్ణ గ్రామానికి చెందిన తిరుమలశెట్టి రాజ్యానికి చెందిన మూడు సవర్ల బంగారు గొలుసు రెండు రోజులుగా కనిపించలేదు. ఇంట్లో, తెలిసిన వారి వద్ద విచారించి.. చివరికి కారంచేడు పోలీస్‌లను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా తన సిబ్బందితో ఆమె అనుమానించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. అక్కడ అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదు. ఇంటి చుట్టపక్కలకు ఎవరూ వచ్చిన దాఖలాలు లేకపోవడంతో ఆ ప్రాంతంలోనే వెతికించగా గొలుసు దొరికింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పొయిందనుకున్న గొలుసు దొరకడంతో ఆమె ఎస్‌ఐకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది.


