టైరు పేలి అదుపు తప్పిన కారు
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అన్నదమ్ములు అన్న మృతి.. తమ్ముళ్లకు గాయాలు 108లో చీరాల ఆసుపత్రికి తరలింపు మృతుడు ఓ చానల్ ఉద్యోగి
కారంచేడు: పెదనాన్న కుమారుడు మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి చీరాల (వాడరేవు) వస్తున్న వారి కారు వెనుక టైరు పేలిపోయింది. అదుపు తప్పిన కారులో ప్రయాణిస్తున్న అన్నదమ్ముల్లో అన్న మృతి చెందగా.. ఇద్దరు తమ్ముళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం వాడరేవు–పిడుగురాళ్ల 167/ఏ జాతీయ నూతన రహదారిలో కారంచేడు–చీరాల రోడ్డులోని కుంకలమర్రు సమీప రహదారిలో గురువారం జరిగింది. సంఘటన స్థలాన్ని కారంచేడు ఎస్‌ఐ షేక్ ఽఖాదర్‌బాషా పరిశీలించి వివరాలు సేకరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. చీరాల మండలం వాడరేవు ప్రాంతానికి చెందిన ముంగర కులశేఖరరాజు, కమలారాజుకు నలుగురు సంతానం. వీరందరూ ఉద్యోగాల నిమిత్తం ఒకరు బెంగళూరులో, ముగ్గురు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. పెదనాన్న కుమారుడైన నాగరాజు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ నుంచి మృతుడు ముంగర మనోహరరాజు (45), ఆయన తమ్ముళ్లు ముంగర జాన్ సిల్వెస్టర్ రాజు, ముంగర నిరీక్షణ రాజులు కారులో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వారి కారు కారంచేడు–చీరాల రోడ్డులో (నూతన బైపాస్‌లో) కుంకలమర్రు డొంక దాటిన తరువాత టైరు ఒక్కసారిగా పేలిపోయింది. కారు వేగంగా వస్తుండటంతో అదుపు తప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డు మార్జిన్ దాటి ఎదురు రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చోని ఉన్న మనోహరరాజు తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ముందు వరుసలో ఉన్న తమ్ముళ్లు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, సమీప పొలాల్లోని రైతులు గమనించి వారిని 108 వాహనంలో చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్‌లోని టీవీ 9 చానల్‌లో వీడియో ఎడిటింగ్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మృతుడికి ఇంటర్ చదివే ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
టైరు పేలి అదుపు తప్పిన కారు


