ఫోర్జరీ సంతకాలతో భూముల విక్రయం
రౌడీ షీటర్ జలీల్ దందాలకు అడ్డుకట్ట వేయాలని రైతుల డిమాండ్
మంగళగిరి టౌన్ : రైతుల భూములను చేజిక్కించుకునే లక్ష్యంతో సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ దస్తావేజులు సృష్టించి భూములు విక్రయించిన రౌడీ షీటర్ జలీల్ దందాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు డిమాండ్ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని చినకాకానిలో బుధవారం ఈ ఘటనపై రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ సర్వే నెం. 182/1లోని 10 ఎకరాల 25 సెంట్ల వ్యవసాయ భూమిపై నకిలీ దస్తావేజులు సృష్టించి, రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇతరులకు కోట్లాది రూపాయలకు విక్రయించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన సహచరులతో కలసి భూమిలోకి చొరబడి రైతులను బెదిరించిన ఘటన తీవ్ర ఆందోళనకు కారణమైందని పేర్కొన్నారు. రైతులు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. రైతుల భూములపై నకిలీ పత్రాలు సిద్ధం చేసి తప్పుడు నమూనా సర్వేలు చూపిస్తూ భూమిని వదిలివేయాలని బెదిరిస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు. పలువురు రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి పంచాయితీ, రెవెన్యూ రికార్డుల్లో తారుమారు చేయడం వంటి చర్యలు వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రౌడీషీటర్ జలీల్, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు వెంకటేశ్వరరావు, నరసింహారావు, శివన్నారాయణ, కొండలరావు, శ్రీనివాసరావు, ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


