ముమ్మరంగా సంతకాల సేకరణ
మాచర్ల: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ మాచర్ల నియోజక వర్గంలో ముమ్మరంగా కొనసాగుతోంది. పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఐదు మండలాలు, పట్టణం నుంచి 63,556 సంతకాలు సేకరించారు. విద్యార్థులు, మహిళలు, యువజనులు, వ్యాపారస్తుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఆయా మండల, జిల్లా అనుబంధ సంఘాల నాయకులు, మండల ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. త్వరలోనే నియోజక వర్గం నుంచి 70వేలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 31వ వార్డులో బుధవారం పట్టణ అధ్యక్షులు పోలా శ్రీను, నియోజకవర్గ ఎస్సీ నేత కందుకూరి మధు ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటికీ వెళ్లారు. సంతకాలు సేకరించి పత్రాలను పార్టీ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు, కౌన్సిలర్ గురవయ్య, జిల్లా ఎస్సీ విభాగ నాయకులు కొమ్ము బొంగురు, పిన్నెల్లి హనిమిరెడ్డి, నల్ల వెంకటరెడ్డి, పుల్లారావు, అజయ్ పాల్గొన్నారు.
ముమ్మరంగా సంతకాల సేకరణ


