వేస్ట్ రాళ్లకు కూడా మైనింగ్ సెన్సు చెల్లించాలా!
చిలకలూరిపేట టౌన్: ఏఎంఆర్ మైనింగ్ సంస్థకు సంబంధించిన మండలం పరిధిలో మరోమారు వివాదం జరిగింది. ఆలయానికి వేస్ట్ రాతిని తరలిస్తున్న వాహనాల్ని ఏఎంఆర్ సిబ్బంది అడ్డుకోవడంతో సమస్య నిరసన తెలిపే వరకు వెళ్లింది. వివరాలల్లోకి వెళితే..పురుషోత్తమపట్నం గ్రామంలో షిరిడీ సాయిబాబ ఆలయం ట్రస్ట్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, కమిటీ సభ్యుల నేతృత్వంలో దత్రాత్రేయ స్వామి ఆలయంలో 158 అడుగుల ఏకశిలా స్థూపం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఇందుకు సంబంధించి శంకుస్థాపక కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో లోతైన గుంతల్లో వేసేందుకు రాళ్లు అవసరం కావడంతో బుధవారం మద్దిరాల గ్రామంలోని గ్రానైట్ మిల్లుల వద్ద వేస్ట్‌గా పడేసిన రాళ్లను రెండు వాహనాల్లో తీసుకుని బయలుదేరారు. ఈ క్రమంలో మద్దిరాలలోని ఏఎంఆర్ చెక్‌పోస్టు వద్ద సదరు సంస్థ సిబ్బంది చలానా చెల్లించాలంటూ వాహనాన్ని నిలుపుదల చేశారు. ఇది రోడ్ల వెంట వేస్ట్‌గా పడేసిన రాళ్లని, ఆలయ పనులకు స్థానికులను అడిగి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. సిబ్బంది వినతి మేరకు సంస్థ అధికారులతో వారు ఫోన్‌లో మాట్లాడగా మాలధారుల్ని దురుసుగా, హేళనగా సమాధానం ఇచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహించారు. భక్తులు, ఏఎంఆర్ అధికారులతో వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న పురుషోత్తమపట్నంకు చెందిన ఆలయ కమిటీ సభ్యులు, దత్తాత్రేయ మాలధారులు భారీగా అక్కడికి తరలివచ్చారు. ఏఎంఆర్ సంస్థ వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటకు పైగా కూర్చొని అక్కడే భజన చేస్తూ తమ నిరసనను కొనసాగించారు. దీంతో రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ జి.అనిల్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కార్యక్రమంలో బత్తినేని శ్రీనివాసరావు, తోట సత్యం, దత్తాత్రేయ మాలధారులు, మహిళలు ఉన్నారు.


