పత్తి రైతుకు కొనుగోలు కష్టాలు
సత్తెనపల్లి: జిల్లాలో ఏడు వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో 11 జిన్నింగ్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10 కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. చిలకలూరిపేటలో మరో కేంద్రాన్ని ఇంకా ప్రారంభించలేదు. కేవలం 20,224 క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. సగం మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశారని, మిగిలిన సగం దళారులే కొనుగోలు చేసి సీసీఐ కేంద్రాల్లో విక్రయాలు జరిపారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. జిల్లాలో జిన్నింగ్ మిల్లులు అనేకం ఉన్నా చంద్రబాబు సర్కార్ నామమాత్రంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు చేపట్టవచ్చు.
దక్కని మద్దతు ధర...
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్వింటా రూ. 8,110 ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ఆశపడ్డారు. అయితే సీసీఐ నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ముఖ్యంగా తేమ శాతం 12 వరకు మాత్రమే ఉండాలని, 8 నుంచి పెరిగిన ప్రతి ఒక్క శాతం చొప్పున మద్దతు ధర తగ్గిస్తున్నారు. బన్నీ లేదా బ్రహ్మరకం పత్తికి పింజ పొడవు 29.50 నుంచి 30.50 ఎంఎం వరకు, మైక్రోనైర్ 3.50 నుంచి 4.30 మధ్య ఉండి 8 శాతం తేమ ఉంటే క్వింటా రూ. 8,110 ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. తేమ 9 శాతం ఉంటే రూ. 8,028.90, తేమ 10 శాతం ఉంటే రూ. 7,947.80, తేమ 11 శాతం ఉంటే రూ. 7,866.70, తేమ 12 శాతం ఉంటే రూ. 7,785.60 చొప్పున క్వింటా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఇదే విధంగా బ్రహ్మ స్పెషల్, ఎంఈసీహెచ్ రకాలకు కూడా ధరలు నిర్ణయించారు. దుమ్ము, ధూళి, చెత్తాచెదారం, గుడ్డిపత్తికాయలు, రంగుమారినా, పురుగుపట్టిన, కౌడిపతి, ముడుచుకు పోయిన పత్తి కాయలను వేరు చేసి తెస్తేనే కొనుగోలు చేస్తామనే నిబంధనలు విధించారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులు మాత్రమే పత్తి కొనుగోలు కేంద్రానికి రావాలని నిబంధన పెట్టారు.
పత్తి కొనుగోళ్లలో
చంద్రబాబు సర్కార్ ఉదాసీనత
నామమాత్రంగా 11 కేంద్రాలు ఏర్పాటు
జిల్లా వ్యాప్తంగా పత్తి సాగు
2.60 లక్షల ఎకరాలు
దిగుబడుల అంచనా
12.28 లక్షల క్వింటాళ్లు
జిల్లాలో ఇప్పటి వరకు
20,224 క్వింటాలే కొనుగోలు
జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1,02,400 మంది రైతులు 2.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 10–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని భావించారు. సగటున 12 క్వింటాళ్ల చొప్పున 12,28,800 క్వింటాళ్లు పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు 11 కేంద్రాలను జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేశారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు జిల్లాలో 537 మంది రైతులకు చెందిన 20,224 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు.
పత్తి రైతుకు కొనుగోలు కష్టాలు


