ఉపాధి, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలం
రేపల్లె: నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న విమర్శించారు. పట్టణంలోని కొరటాల సమావేశ మందిరంలో ఆది వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 4.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించుకున్నారన్నారు. ఏడాదిన్నరలో మెగా డీఎస్సీ తప్పా, ప్రభు త్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నట్లు ఉద్యోగాలు కల్పించలేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచారం చేసుకుంటున్నట్లు చీపురు పట్టుకొని ఊడ్చే ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ఆయన ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కంపెనీలల్లో ఎక్కడా 500కు మించి ఉద్యోగాలు లేవని, ఒక్క గూగుల్ డేటా సెంటర్‌ను పెట్టుకొని 1,80,000 ఉద్యోగాలు ఇస్తామ ని ఐటీశాఖ మంత్రి లోకేష్ ప్రకటించడం యువకులు, నిరుద్యోగులను మభ్యపెట్టటమేనని తెలిపారు. వాస్తవానికి విరుద్ధంగా ప్రచారం చేసుకుంటున్నారని పే ర్కొన్నారు. గూగుల్ కంపెనీలోనే అసలు 1,80,000 ఉద్యోగాలు లేకపోతే ఇక్కడ ఒక్క డేటా సెంటర్లో ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరుతో 600ఎకరాలు తీసుకొని ఒక్కరికీ కూడా ఉద్యో గం ఇచ్చినటువంటి దాఖలాలు లేవని విమర్శించారు. రాయలసీమకు వస్తున్న కంపెనీలలో స్థానికులకు 70శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, ఆ విధంగా ఇవ్వటం లేదని తెలిపారు. కేవలం వాచ్‌మెన్ పోస్టులకి పరిమి తం చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన మాదిరిగా స్థానికులకు ప్రాధాన్యతనిచ్చి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిగా వ్యవహరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని రామన్న కోరారు. సమావేశంలో డీవైఎఫ్‌ఐ కార్యదర్శి కె.వి.లక్ష్మణరావు, అధ్యక్షులు సీహెచ్.ప్రకాష్, డీవైఎఫ్‌ఐ మాజీ నాయకులు సీహెచ్.మణిలాల్ పాల్గొన్నారు.
డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న


