
అప్రమత్తతతో ఆనంద దీపావళి
ఈ నిబంధనలు తప్పనిసరి
పట్నంబజారు: సంతోష సంబరాలతో వెలుగులు నింపే పండుగ దీపావళి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. వెలుగుల కాంతులు.. చిన్నారుల కేరింతలు.. ఆనందమయంగా జరుపుకోవాల్సిన పండుగ రోజున.. మనం చేసే చిన్న చిన్న పొరపాటులే ఎంతో విషాదాన్ని మిగిలుస్తాయి. దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బాణసంచా విక్రయాలు ప్రారంభమూయ్యాయి. సోమవారం దీపావళి కావటంతో రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులు, యువత, చిన్నారుల బాణసంచా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పరిధిలో మొత్తం 120 షాపులకుపైగా ఏర్పాటు చేశారు. ఏడాది మొత్తం నడిచే గోడౌన్‌లు సుమారుగా 22పైగా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. టపాసులు కాల్చే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో ఆరేళ్ల చిన్నారి దుస్తులుపై నిప్పురవ్వలు పడి.. దుస్తులకు మంటలు అంటుకుని.. శరీరమంతా గాయాలపాలైన సంఘటన చోటుచేసుకుంది. ఇటువంటి ప్రమాదాలుజరగకుండా ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగుల హరివిల్లు పూయించాలని కోరుకుందాం.
నిబంధనల ప్రకారమే లైసెన్స్‌లు
బాణసంచా దుకాణాల ఏర్పాటులో రెవెన్యూ, ఫైర్, పోలీసు అధికారుల అనుమతులు తప్పనిసరి. పూర్తిస్థాయిలో అధికారులు ధ్రువీకరించిన తరువాతే ఏర్పాటుకు అనుమతినిస్తారు. ఖాళీ స్థలంలో దుకాణం ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఉంటాయి.
ఈ ప్రాంతంలో ఎటువంటి పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్‌మాల్స్ వంటివి ఉండకూడదు. 50 షాపులు ఉంటే దానిని క్లస్టర్ అని అంటారు. అంతకు మించి ఆ గ్రౌండ్స్‌లో దుకాణాలకు అనుమతి ఇవ్వకూడదు. జిల్లా కేంద్రంలో జిల్లా ఫైర్ ఆఫీసర్, గ్రామీణ ప్రాంతాలలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ తాత్కాలిక అనుమతులు ఇస్తారు. హోల్‌సేల్ వ్యాపారాలకు సంబంధించి ఉన్న సరుకు లిస్ట్, కట్టిన జీఎస్టీ, తదితర అంశాలను పరిశీలించి అనుమతులు ఇస్తారు. దీనితో పాటుగా ప్రతి బాణాసంచా దుకాణం వద్ద ఇసుకతో ఉన్న బక్కెట్లు, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదమే..
చిన్నారులతో మరింత జాగ్రత్త అవసరం
చిన్న ప్రమాదం జరిగినా
భారీ మూల్యం చెల్లించాల్సిందే...
షాపులు ఖాళీ ప్రదేశాలలో మాత్రమే
ఏర్పాటు చేయాలి.
జనావాసాలకు దూరంగా ఉన్న ఒక అంతస్తు మాత్రమే ఉండే భవనాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు.
దుకాణానికి, దుకాణానికి మధ్య ఖాళీ ఉండాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగితే తక్షణం నియంత్రించేలా ఏర్పాట్లు ఉండాలి.

అప్రమత్తతతో ఆనంద దీపావళి