
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
చీరాల: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడు పిట్ల సూరిబాబును బుధవారం అరెస్ట్ చేరు. ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎండీ మొయిన్ వివరాలు వెల్లడించారు. వేటపాలెం మండలం అక్కాయపాలెం పంచాయతీలోని చీరాల ఇంజినీరింగ్ కాలేజీ వెనుక ఉన్న జంగిలి కోటేశ్వరరావు కాలనీకి చెందిన పిట్ల సూరిబాబు అనే వ్యక్తి మద్యానికి బానిసై కాలనీలోని ఆడపిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండే వాడు. ఈ విషయంలో పలుమార్లు కాలనీవాసులు మందలించారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఏడు సంవత్సరాల బాలికను తినుబండారాలు కొనిస్తానని మాయమాటలు చెప్పి ఆ కాలనీలోని పాడుబడిన ఇంటిలోనికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అది గమనించిన తోటి బాలిక వారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో స్థానికులు వచ్చి సూరిబాబుకు దేహశుద్ధి చేయడంతో అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఈ మేరకు బాలిక తల్లి ఈపురుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు కటారివారిపాలెంలోని జీడితోటలో ఉండగా.. అందిన సమాచారం మేరకు బుధవారం మధ్యాహ్నం మధ్యవర్తుల సమక్షంలో జీడితోటల్లో నక్కి ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు. సమావేశంలో రూరల్ సీఐ ఎం.శేషగిరిరావు, రూరల్ ఎస్‌ఐ ఎ.చంద్రశేఖర్, సిబ్బంది ఉన్నారు.