
పాఠశాలల్లో స్కౌట్స్, గైడ్స్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సమానత్వ భావాలతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్‌లో గుంటూరు జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వార్షిక సమావేశాన్ని జిల్లా కార్యదర్శి ఎం. ఏడుకొండలు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు గుంటూరు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ రిజిస్ట్రేషన్, బిగినర్స్ కోర్స్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 955 పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 50 వేలు చొప్పున విడుదల చేసిన నిధులతో విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉన్నతమైన సంస్థగా గుర్తింపు పొందిన స్కౌట్స్, గైడ్స్ ఆశయాలకు అనుగుణంగా సేవా భావంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని 111 పాఠశాల నుంచి 136 యూనిట్స్ రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. సమావేశంలో ఎస్‌ఓసీ పి. శ్రీనివాసరావు, చేబ్రోలు ఎంఈవో రాయ సుబ్బారావు, పెదకాకాని ఎంఈఓ బీవీ రమణయ్య, డీటీసీ టి. నరేష్, డీఓసీ ఎం.శ్రీ హరి, ఘంటా కిరణ్, కామాక్షి, అనిల్, నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర కార్యదర్శి ఆర్.నరసింహారావు