
అతుకులకట్ట.. భద్రత ఎట్టా!
వరదలు ఉధృతమైతే కరకట్ట మనుగడ ప్రశ్నార్థకం పాఠాలు నేర్వని కూటమి ప్రభుత్వం మరమ్మతులకు నిధులు కేటాయింపులో మొండిచెయ్యి
ప్రతి వర్షాకాలం క్షణక్షణం.. భయం భయంగా లంకగ్రామాలు
కొల్లూరు: కృష్ణా కరకట్ట భయపెడుతోంది.. వరదొస్తే క్షణక్షణం భయం.. పరీవాహక గ్రామాలకు రక్షణ కవచంగా ఉండాల్చిన కరకట్ట భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 67 కిలోమీటర్లు పొడవునా అతుకుల బొంతను తలపించేలా కరకట్ట మారింది. కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
అభివృద్ధికి నిధులు లేవు..
కృష్ణా నదికి వరదలు వచ్చే సమయంలో ప్రభుత్వం హడావిడి చేస్తుంది. శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లాలో కొల్లూరు మండలం చిలుమూరు శివారు కొత్త చిలుమూరు నుంచి రేపల్లె మండలం లంకేవానిదిబ్బ వరకు 67 కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉంది. 55 ప్రాంతాలలో బలహీనంగా మారినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. మరో 20 వరకు పెరుగుతాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కానీ కరకట్ట పటిష్టతకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు.
డేంజర్ స్పాట్లు ఇలా...
కొల్లూరు ఆర్‌సీ సెక్షన్ (రివర్ అండ్ కన్జర్వేషన్) పరిధిలో ఈపూరు, దోనేపూడి– కోటిపల్లి ప్రాంతాలలో అధిక చోట్ల కరకట్ట బలహీనంగా మారింది. గతంలో తాత్కాలిక మరమ్మతులలో భాగంగా వేచిన ఇసుక మూటలు ధ్వంసమై వరద తీవ్రత పెరిగిన పక్షంలో తట్టుకొని నిలవడం కష్టంగా తయారైంది. వీటికి తోడు సాగు నీటి కోసం ఏర్పాటు చేసిన పైప్‌లైన్లతో ముప్పు పొంచిలేకపోలేదు. పెనుమూడి ఆర్‌సీ సెక్షన్ పరిధిలో 51 ప్రాంతాలలో కరకట్ట బలహీనంగా మారి ప్రమాదకరంగా మారడం కరకట్ట దుస్థితికి అద్దం పడుతుంది.
అనుభవాల నుంచి నేర్వని గుణపాఠాలు
2024లో 11.43 లక్షల క్యూసెక్కులు వరద ముంచెత్తడంతో జిల్లాలోని కరకట్ట పొడవునా ప్రజలు నిద్రాహారాలు మాని స్వచ్ఛందంగా కదలి కట్ట తెగకుండా అడ్డుకట్టలు వేస్తూ కంటికి రెప్పలా కాపాడుకొని గ్రామాలపై వరద విరుచుకుపడకుండా అడ్డుకున్నారు. చివరి నిమషంలో కృష్ణమ్మ తగ్గుముఖం పట్టడంతో గండం గట్టెక్కి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్నుంచి కరకట్ట బలహీనంగా ఉండి కోతలకు అవకాశాలున్న ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడంతో ప్రస్తుత ఏడాది కృష్ణా నది వరదలు ఉదృతరూపం దాల్చితే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థ్ధకంగా మారింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణా నదిలో పెరుగుతున్న వరద
కొల్లూరు: కృష్ణా నదికి వరద ఉధృతి పెరగింది. నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.75 లక్షల క్యూసెక్కులు సోమవారం విడుదల చేస్తున్నారు. మండలంలోని పెసర్లంక– పెదలంక అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి, గాజుల్లంక చినరేవు, పోతార్లంక – గాజుల్లంక నడుమ కృష్ణా నది గట్లకు ఏర్పడిన గండ్లు ద్వారా వరద నీరు ఉధృతంగా పల్లపు ప్రాంతాలలోకి ప్రవహిస్తున్న కారణంగా గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. దోనేపూడి కరకట్ట దిగువును పోతార్లంక– దోనేపూడి లోలెవల్ వంతెన(చప్టా) పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, కిష్కిందపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి ప్రజలు చుట్టు మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.
బాపట్ల: బంగాళాఖాతంలో అల్ప పీడనంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 గంటలపాటు కంట్రోల్ రూమ్ నెంబర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.
కంట్రోల్ రూమ్ 9711077372 టోల్–ఫ్రీ నంబర్ 1077, 1070

అతుకులకట్ట.. భద్రత ఎట్టా!

అతుకులకట్ట.. భద్రత ఎట్టా!