
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
బాపట్లటౌన్: అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 65 మంది బాధితులు వచ్చి నేరుగా తమ సమస్యలను ఎస్పీకు వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ అర్జీల స్వీకరణ అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మానవీయ కోణంతో వ్యవహరిస్తూ అర్జీలను చట్టపరిధిలో పరిష్కరించాలని చెప్పారు. పదేపదే బాధితులను స్టేషన్ చుట్టూ తిప్పుకోరాదని సూచించారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులకు తగిన గౌరవం ఇచ్చి వారితో ఫ్రెండ్లీగా మెలగాలని కోరారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని పరిష్కరించినప్పుడే పోలీస్‌శాఖపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ యు.శ్రీనివాసులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి
బాపట్లటౌన్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సైబర్ నేరాలపై ఎస్పీ ప్రచార పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్(ఆన్‌లైన్ వీడియో కాల్‌లో అరెస్ట్) అనేది లేదని, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు చేసే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినుట్లు వివరించారు. డిజిటల్ అరెస్ట్, పీఎం కిసాన్ యాప్ ఏపీకే ఫైల్స్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, నకిలీ లోన్ యాప్స్, పార్ట్ టైం జాబ్స్, నకిలీ వెబ్‌సైట్లు, బ్యాంకింగ్, ఈ కామర్స్, సోషల్ మీడియా వంటి పలు రకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతూ బాధితుల నుంచి రూ.లక్షల్లో నగదు కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు.
ఎస్పీ ఉమామహేశ్వర్