అతిసారం.. ప్రాణాంతకం | - | Sakshi
Sakshi News home page

అతిసారం.. ప్రాణాంతకం

Sep 19 2025 2:15 AM | Updated on Sep 19 2025 2:15 AM

అతిసారం.. ప్రాణాంతకం

అతిసారం.. ప్రాణాంతకం

● కలుషిత నీరు, ఆహారంతో వ్యాప్తి ● అశ్రద్ధ చేస్తే ప్రాణాలకు ముప్పు

లక్షణాలు ఇవి...

జీర్ణవ్యవస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉండి వాంతులు, విరేచనాలు నీళ్లు, నీళ్లుగా అవుతాయి.

కడుపులో మెలి పెట్టినట్లు నొప్పి ఉంటుంది.

నీరసం, వికారం, వాంతులు, శరీరంలో లవణాలు పోయి పిక్కల నొప్పులు వస్తాయి.

మనం తాగే నీరు శరీరం నుంచి అధిక మొత్తంలో బయటకు వెళ్లిపోతే డీహైడ్రేషన్‌ ఏర్పడి ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది.

డీహైడ్రేషన్‌లో నాడి వేగంగా లేదా బలహీనంగా కొట్టుకోవడం లేదా ఒక్కోసారి అసలు తెలియపోవడం జరుగుతుంది.

నీరసం, నోరు, నాలుక, పిడచకట్టుకు పోవడం, శరీరం ఎండిపోవడం, ఒక్కోసారి మూత్రం అసలు రాకపోవటం లేదా చాలా తక్కువగా రావటం లేదా ముదురు పసుపు రంగులో వస్తుంది.

వయస్సుతో సంబంధం లేకుండా డీహైడ్రేషన్‌ వస్తుంది. దీనివల్ల పిల్లలకు, వృద్ధులకు ఎక్కువ ప్రమాదం.

గుంటూరు మెడికల్‌: వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం (డయేరియా) ముఖ్యమైంది. సకాలంలో వైద్యం చేయించని పక్షంలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. గుంటూరు నగరంలో మంగళ, బుధవారాల్లో 25 మంది వ్యాధి బారిన పడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఏటా వర్షాకాలంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అతిసార వ్యాధి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత ఏడాది గుంటూరు నగరం శారదా కాలనీలో 326 కేసులు నమోదు కాగా, ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. చేబ్రోలు పీహెచ్‌సీ పరిధిలోని మంచాల గ్రామంలో 62 డయేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల నగరంలో కేసులు వస్తున్న నేపథ్యంలో వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం

వ్యాధి సోకడానికి కారణాలు

విరోచనాలు నీళ్లుగా, పలచగా అవుతుంటే డయేరియా(అతిసార వ్యాధి) అంటారు. వైద్య పరిభాషలో దీన్ని గ్యాస్ట్రో ఎంటైరెటిస్‌గా పిలుస్తారు. ఈ వ్యాధి జీర్ణవ్యవస్థకు సోకుతుంది. నీళ్ల విరేచనాలు నూటికి 70శాతం వైరస్‌ క్రిముల వల్ల వస్తాయి. కలుషితమైన నీటిని తాగడం వల్ల, మలం మీద వాలిన ఈగలు ఆహార పదార్థాలపై వాలిన తర్వాత తినడం ద్వారా వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి విరేచనాలవుతాయి.

పిల్లలకు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి

డయేరియా వల్ల పెద్దవారికంటే పిల్లలకు ఎక్కువగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. దాహం పెరిగితే ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తాగించాలి. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందిస్తారు. ఒక ప్యాకెట్‌ పౌడర్‌ను లీటర్‌ నీటిలో కలుపుకుని తాగించాలి. విరోచనాలు అయ్యేవారికి కారం, మసాలావంటి ఘాటు పదార్థాలు పెట్టకూడదు. డయేరియా తగ్గే వరకు వైద్యుల సలహా ప్రకారం మందులు, ఆహారం అందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement