
ప్రభుత్వమే మెడికల్ కాలేజీ నిర్మించాలి
బాపట్ల అర్బన్: ప్రభుత్వమే బాపట్ల మెడికల్ కాలేజీని నిర్మించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సింగయ్య అన్నారు. నిర్మాణంలో ఉన్న బాపట్ల మెడికల్ కాలేజీని గురువారం ఆయన ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం వలన వైద్య విద్యను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు దూరం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అన్నారు. డాక్టర్ కావాలన్న వారి కల కలగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు కూడా వారు కోల్పోతున్నారని చెప్పారు. చంద్రబాబు మెడికల్ సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. పీపీపీ విధానం వెనుక లంచాలు, తమ సామాజిక వర్గం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులను 63 సంవత్సరాలకు ఎలా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే చాలు ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తారని మండిపడ్డారు. తన కేబినెట్లో ఉన్న మంత్రి నారాయణ, విద్యా సంస్థలు నడుపుతున్న వారికి మెడికల్ కళాశాలలను ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు కొచ్చర్ల వినయ్ రాజు, కుల నిర్మూలన పోరాట సమితి పట్టణ కార్యదర్శి కోలా శరత్, రైతు కూలీ సంఘం కార్యదర్శి కొండయ్య, బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఏపూరి జోసెఫ్ పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి సింగయ్య