
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం
బాపట్ల టౌన్: బాఽధితుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 54 మంది అర్జీదారులు పాల్గొని, తమ సమస్యలను ఎస్పీకు వివరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్న ఆయన త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అధికంగా భర్త, అత్తారింటి వేధింపులు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు వంటి కేసులు అధికంగా వస్తున్నాయన్నారు. వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా చట్టపరంగా విచారించి పరిష్కరించాలని చెప్పారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని అధికారులను హెచ్చరించారు. తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, పీజీఆర్‌ఎస్ సెల్ ఎస్‌ఐ ఏ.నాగేశ్వరరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ బి. ఉమామహేశ్వర్