
రోడ్లపైనే జంతువుల వధ
విచారించి చర్యలు తీసుకుంటాం
నరసరావుపేటటౌన్: నరసరావుపేట పట్టణంలో బహిరంగంగానే జంతువులను వధిస్తున్నారు. బహిరంగ జంతు వధ నిషేధం అమలులో ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్తం, అవశేషాలు, దుర్వాసన వాతావరణాన్ని కలుషితం చేస్తుండగా, కాలుష్య సమస్యలు ఆరోగ్యానికి ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డీమార్ట్ పక్కన, హార్డ్ జూనియర్ కళాశాల ఎదుట ప్రతి ఆదివారం పందులను నడిరోడ్లపై యథేచ్ఛగా వధ చేస్తున్నారు. దీంతోపాటు ఎస్‌ఎస్ అండ్ ఎన్ కళాశాల ఎదుట గాడిదలను అక్కడే వధ చేసి మాంసం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మాంసం విక్రయాలపై ఇప్పటికే అనేకమార్లు మున్సిపల్, ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించిన దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు. వధ చేసే పరిసరాల చుట్టుపక్కల చెదలు, కుక్కలు చేరి దుర్వాసన వ్యాపిస్తోంది. రహదారులపై మిగిలిపోయే రక్తం, మాంసపు ముక్కల వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం
పలుమార్లు మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా, పెద్దగా చర్యలు కనిపించడం లేదని వాపోతున్నారు. ప్రతి వారం మాంసం విక్రయదారుల నుంచి మామూళ్లు తీసుకొని వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, శుభ్రతపై నినాదాలు చేస్తూనే.. మరోవైపు బహిరంగ వధలపై పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రజారోగ్యంపై దుష్ప్రభావాలు
వధ సమయంలో తగిన శానిటేషన్ లేకపోవడం వల్ల జూనోటిక్ వ్యాధులు (జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధులు) వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. జంతువుల రక్తం, అవశేషాలు వల్ల హెపటైటిస్–ఎ, టైఫాయిడ్, కలరా, లెప్టోస్పైరోసిస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెందవచ్చు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా వచ్చిన మాంసం ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలపై ఇవి ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. కలుషిత మాంసం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి, బహిరంగ వధలకు పాల్పడే వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
పర్యావరణంపై ప్రభావం..
రక్తం, మాంసపు ముక్కలు వలన దుర్వాసన కాలుష్యం ఏర్పడుతుంది. చెదలు, ఎలుకలు, కుక్కలు చేరి పర్యావరణంలో మలిన వాతావరణం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. వర్షపు నీటితో ఈ మలినాలు కలసి కాలువలు, తాగునీటి వనరులు కలుషితం అవుతాయి. ఈ పరిణామాలు పర్యావరణానికే కాక ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతోపాటు రోడ్ల మీద వధ చూసే పిల్లల్లో భయం, మానసిక ఒత్తిడి కలుగుతుంది. ప్రజల్లో సమాజ శుభ్రతపై నిరాసక్తత పెరుగుతుంది. బహిరంగ వధ ప్రాంతాల్లో నివసించే వారికి సామాజిక అవమానం, జీవన ప్రమాణం తగ్గడం మొదలవుతుంది.
బహిరంగ జంతు వధకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. హార్డ్ జూనియర్ కళాశాల, ఎస్‌ఎస్ అండ్ ఎన్ కళాశాలల వద్ద తనిఖీలు చేపట్టి అక్రమంగా జంతు వధకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
–జస్వంత్‌రావు, మున్సిపల్ కమిషనర్

రోడ్లపైనే జంతువుల వధ