
ఘర్షణలో నిందితుడికి రిమాండ్
బల్లికురవ: మండలంలోని వేమవరం నాలుగు రోడ్ల జంక్షన్‌లో జరిగిన ఘర్షణలో నిందితుడికి అద్దంకి కోర్టు మంగళవారం 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వై.నాగరాజు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న జరిగిన ఘర్షణలో నిందితునిగా ఉన్న ఉప్పుమాగులూరు గ్రామానికి చెందిన జాగర్లమూడి వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంప దెబ్బ
తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఎంఐఎం నాయకుడు
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వంతోపాటు కూటమి నేతలు సైతం బలపరిచి చట్టం చేసిన వక్ఫ్ చట్టంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించడం కేంద్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని తెలిపారు. మధ్యంతర తీర్పులో మూడు కీలక సెక్షన్లపై స్టే విధించిందన్నారు. బోర్డులో ముస్లింమేతరులను చేర్చరాదని, ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధన వర్తించదని స్పష్టం చేసిందన్నారు. వక్ఫ్ ప్రాపర్టీ ఖరారు అధికారం కలెక్టర్లకు వర్తించదని, అది ట్రీబ్యునల్‌దేనని కోర్టు పేర్కొందన్నారు. సుప్రీంకోర్టులో వక్ఫ్ చట్టంపై పిటిషన్ వేసి స్వయంగా వాదనలు వినిపించిన బారిస్టర్ లా అసదుద్దీన్ ఒవైసీ, ముస్లిం పర్సనల్‌లా బోర్డు వారికి మరోక పిటిషన్ వేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ముస్లిం సమాజం తరపున కృతజ్ఞతలు తెలిపారు.
నేపాల్ బాలిక అదృశ్యం
లక్ష్మీపురం: నేపాల్‌కు చెందిన బాలిక అదృశ్యమైన ఘటనపై అరండల్‌పేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ దేశానికి చెందిన గోవింద్ తాప అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లి అక్కడ హోటల్‌లో పని చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల రెండు నెలల క్రితం గోవింద్ తాప కుమార్తె సరిత కుమారి మరి కొంత మందితో కలిసి గుంటూరుకు వచ్చి, గుంటూరులోని రైల్వే కోచ్ రెస్టారెంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఈనెల 14వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. విషయం తెలుసుకున్న తండ్రి గోవింద్ తాప గుంటూరు వచ్చి చుట్టు పక్కల ప్రాంతాలలో, బంధుమిత్రుల వద్ద ఎంత వెతుకులాడినా ఆచూకీ తెలియక పోవడంతో దిక్కు తోచక అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు అరండల్‌పేట పోలీసు స్టేషన్ 0863–2231955, సీఐ ఆరోగ్య రాజు 8688831332, ఎస్‌ఐ రోజాలత, 8688831334, నంబర్లకు సమాచారం తెలియజేయాల్సిందిగా సూచించారు.