
గణేషుని నిమజ్జనాలు పకడ్బందీగా చేయాలి
చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్
చీరాల టౌన్: వినాయక చవితి పురస్కరించుకుని నియోజకవర్గంలోని వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లో జరిగే గణపతి నిమజ్జనోత్సవాల్లో అపశ్రుతులు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు సూచించారు. మంగళవారం ఆర్డీఓ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, ఫైర్, మెడికల్, పంచాయతీరాజ్, మత్య్సశాఖ, మైరెన్, మున్సిపల్ అధికారులతో ఆర్డీఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంతోపాటు పర్చూరు, అద్దంకి, చిలకలూరిపేట, నరసరావుపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను.. నిమజ్జనం కోసం వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాలకు తీసుకువస్తారన్నారు. విగ్రహాల తోపాటు అధిక సంఖ్యలో భక్తులు వాడరేవులో స్నానాలు చేస్తారన్నారు. సముద్రంలో లోతుకు వెళ్లి గల్లంతు కావడం, ప్రాణ నష్టం జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తీరం ఒడ్డున ప్రత్యేక అవుట్ పోస్టు, పోలీసులు, గజ ఈతగాళ్లు, మెడికల్ కిట్లు, 108 అంబులెన్స్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసేందుకు ట్రాఫిక్ సిబ్బందిని, బారికేడ్లు, విద్యుత్ లైట్లు, తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. తీరప్రాంతంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం చేయడంతోపాటు బ్లీచింగ్ చల్లించి చెట్లు తొలగించాలన్నారు. నిమజ్జనా ల్లో ప్రాణ, ధన, ఆస్తి నష్టాలు జరగకుండా పనిచేయాలని కోరారు. ఉన్నతాఽధికారుల ఆదేశాలు విధిగా పాటించి నిమజ్జనాలు ప్రశాంతంగా జరిపించాలని తెలిపారు. చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్, తహసీల్దార్ కె.గోపికృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, ఎంపీడీవోలు శివన్నారాయణ, రాజేష్, సీఐలు, ఎస్సైలు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.