
అందుబాటులో 1,681 మెట్రిక్ టన్నుల ఎరువులు
సత్తెనపల్లి: ఖరీఫ్ సాగుకు సత్తెనపల్లి పట్టణ, గ్రామీణ పరిధిలోని ఎరువుల దుకాణాల్లో 1,681 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సత్తెనపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు బి.రవిబాబు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో గల గుంటూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి పట్టణ, గ్రామీణ పరిధిలోని ఎరువుల దుకాణాల్లో యూరియా–590 మెట్రిక్ టన్నులు, డీఏపీ– 327 మెట్రిక్ టన్నులు, పొటాష్ ఎరువులు –95 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు–585 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ–84 మెట్రిక్ టన్నులు నిల్వలు ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. రైతులందరూ మీ మీ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద, ప్రైవేట్ ఎరువుల దుకాణాలు వద్ద నుంచి ఎరువులను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి.సుబ్బారెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.