
జ్వరాల ఆస్పత్రిలో పాముల సంచారం
గుంటూరు మెడికల్ : గోరంట్లలోని ప్ర భుత్వ ఛాతీ, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రి(జ్వరాల ఆస్పత్రి)లో పాములు సంచారంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం రాత్రి రెండు పాములను చంపగా, బుధవారం మరొకట వంటగదిలో ప్రత్యక్షమైంది. వాస్తవానికి ఆస్పత్రి శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పరిశుభ్రంగా ఉంచి పాములు, ఇతర క్రిమికీటకాలు లోపలకు రాకుండా చర్యలు తీసుకోవాలి. అయితే, కాంట్రాక్టర్ పట్టించుకున్న దాఖలా లేదు. పాములు వార్డుల్లోకి వచ్చిన తరువాత అయినా బుధవారం ఆస్పత్రి అంతా స్పెషల్ డ్రైవ్ చేసి, పరిశుభ్రం చేయకపోవడంతో మరలా పెద్దపాము ఏకంగా కిచెన్‌లోకి ప్రవేశించి, సిబ్బంది గుండె ఆగిపోయేంత పని చేసింది. ఆస్పత్రిలో పాముల సంచారం గురించి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకంటి రఘును సాక్షి వివరణ కోరగా విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. పాములు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.