
పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలి
శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణ బాధితుల డిమాండ్
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో భవనాలు కోల్పోతున్న యజమానులకు హైకోర్టు ఆదేశాల మేరకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్ట పరిహారాన్ని చెల్లించిన తరువాతే పనులు ప్రారంభించాలని బ్రాడీపేట–అరండల్‌పేట షాప్ ఓనర్స్ అండ్ కీపర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శంకర్ విలాస్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే బ్రిడ్జి పనులు చేపట్టాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటకీ, అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఆర్వోబీ నిర్మాణంతో భవనాలు కోల్పోతున్న 58 మంది యజమానులకు నష్టపరిహారాన్ని ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ విధంగా దాదాపు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేరకు చెల్లించాల్సిన నష్టపరిహారంతో పాటు ఆర్వోబీ నిర్మాణ వ్యయం రూ.98 కోట్లను కలుపుకుంటే మెగా ఫ్‌లై ఓవర్ నిర్మించవచ్చునని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం హడావుడిగా పిల్లర్స్ నిర్మాణ పనులను చేపట్టారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన వర్క్ ఆర్డర్‌లోనే బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుగానే రోడ్డు విస్తరణ పనులు, కాలువల నిర్మాణం, విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పూర్తి చేయాల్సి ఉందని, అధికారులు ఇవేవీ చేయలేదని విమర్శించారు. అధికారులు ఏకపక్ష వైఖరితో ముందుకు వెళితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే డిజైన్ ప్రకారం హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు మెగా ఫ్‌లై ఓవర్‌ను, సింగిల్ పిల్లర్‌తో పాటు ఆర్‌యూబీలను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాలు సులభంగా ప్రయాణిస్తాయని తెలిపారు. 70 ఏళ్లుగా అభివృద్ధి చెందిన శంకర్ విలాస్ సెంటర్ ఉనికి దెబ్బతినకుండా ఉంటుందని చెప్పారు. ఎర్త్ వాల్‌తో కూడిన ప్రస్తుత డిజైన్ ద్వారా బ్రిడ్జిని నిర్మిేంచడం ద్వారా ఈ ప్రాంతం పూర్తిగా నిర్వీర్యం అవుతుందని అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ నాయకుడు జి.కార్తిక్ మాట్లాడుతూ తాము బ్రిడ్జి నిర్మాణానికి, అభివృద్ధికి వ్యతిరేకం కాదని తెలిపారు. పరిహారం కింద బాండ్లు ఇస్తే తీసుకోబోమని, 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని కోర్టుకు వెళ్లగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. కోర్టు తీర్పును అమలు చేయాలని ఆయన కోరారు.